కవులు ప్రతిపక్షంగా వ్యవహరించాలి : పత్రికా  సంపాదకుడు కే. శ్రీనివాస్

సిద్దిపేట, వెలుగు: తెలంగాణ ప్రజల ఆకాంక్షల పట్ల కవులు, రచయితలు, కళాకారులు తమ కలాలకు, గళాలకు పదునుపెట్టి మార్పు కోసం ప్రతిపక్షంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సాహిత్య కారుడు, పత్రికా సంపాదకుడు కె. శ్రీనివాస్ అన్నారు. ఆదివారం సిద్దిపేటలోని విపంచి ఆడిటోరియంలో  మంజీర రచయితల సంఘం(మరసం) 38వ వార్షిక వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఆత్మగౌరవం కోసం జరిగిన ప్రాణ త్యాగాలకు విలువ ఉండాలని, ఇప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా అంతరాలు ఉన్నాయన్నారు.

రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో తెలంగాణ తనం ఉండడమే కాకుండా సమష్టి తత్వం పెంచుకోవాలని, అవాంఛనీయ పరిస్థితులు కమ్ముకుంటున్న సమయంలో కవులు, రచయితలు మేల్కొవాలని, పాలకులను మేల్కొలపాలని సూచించారు. ప్రత్యేక రాష్ట్ర అవతరణ కాంక్షను జ్వలింపజేసిన మంజీరా రచయితల సంఘం ఇప్పుడు మరింత బాధ్యతగా పురోగమించాలన్నారు. రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. ఆలోచనలకు పదును పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని, గోసతో వచ్చిన తెలంగాణను రక్షించుకోవాలని పిలుపునిచ్చారు.

టీఎన్జీవో రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు దేవి ప్రసాద్ మాట్లాడుతూ..  భావితరాలకు మరసం కరదీపికగా వర్ధిల్లాలని కోరారు. జర్నలిస్ట్ విరహత్ అలీ మాట్లాడుతూ మరసం కవులు సంక్షోభ సమయంలో క్రియాశీలక పాత్ర పోషించాలని కోరారు. తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాలేశ్వరం శంకరం మాట్లాడుతూ ప్రజా ఉద్యమాలకు బాసటగా నిలవాలని పిలుపునిచ్చారు. సభకు అధ్యక్షత వహించిన మరసం అధ్యక్షుడు రంగాచారి మాట్లాడుతూ 37 వసంతాల నుంచి సాహిత్య సృజనకు పరిమితం కాకుండా తమ సంఘం మరింత బాధ్యతగా పనిచేస్తుందని తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ రచించిన జయ జయహే తెలంగాణ పాటల పుస్తకం, మరసం కవులు రచించిన జోల పాటలు కవితా సంకలనాన్ని, సిద్ధంకి యాదగిరి మూడు గుడిసెల పల్లె కథ పుస్తకాన్ని కే. శ్రీనివాస్, నందిని సిధారెడ్డి ఆవిష్కరించారు. అంతకుముందు మరసం పతాకాన్ని సంఘ అధ్యక్షుడు రంగాచారి ఆవిష్కరించారు. దాశరథి, ఆరుద్ర, బిరుదురాజు రామరాజు శత జయంతి వేడుకల సందర్భంగా తైదల అంజయ్య, నందిని సిధారెడ్డి, దేశపతి శ్రీనివాస్ ప్రత్యేకంగా ప్రసంగించారు. సాయంత్రం పొన్నాల బాలయ్య, తోటఅశోక్, అలాజీపూర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కవి సమ్మేళనంలో పలువురు తమ కవితలను చదివి వినిపించారు.