- మణిపూర్‌లో ముగ్గురి కిడ్నాప్, హత్య
- మృతుల్లో తండ్రి, కొడుకు
- కట్టెల కోసం అడవిలోకి వెళ్లినోళ్లను చంపిన మిలిటెంట్లు
- మృతదేహాలపై తీవ్రంగా హింసించిన గుర్తులు
ఇంఫాల్: మణిపూర్‌లో హింస మళ్లీ విజృంభిస్తున్నది. తాజాగా ముగ్గురిని కిడ్నాప్ చేసి హత్య చేశారు. కుకీ టెర్రరిస్టులు వీరిని చంపేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. పర్వత ప్రాంతాలైన చురచాంద్పూర్, బిష్ణుపూర్ జిల్లాల మధ్య బఫర్‌జోన్‌లో ఈ ఘోరం జరిగింది. రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌కు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిష్ణుపూర్‌లోని అకాసోయ్ గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు కట్టెల కోసం బుధవారం సమీపంలోని అడవికి వెళ్లారు. వీరిని మిలిటెంట్లు కిడ్నాప్ చేశారు. కుటుంబ సభ్యులు, గ్రామస్థలు ఫిర్యాదుతో పోలీసులు కూంబింగ్ చేపట్టారు. గురువారం పోలీసు బలగాలకు కిడ్నాప్‌కు గురైన ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరిని మిలిటెంట్లు హింసించి హత్య చేసినట్లు బాడీలపై గాయాలున్నాయి. హత్యకు గురైన వారిలో తండ్రి, కొడుకు ఉన్నారు. చురచాంద్ పూర్ జిల్లాలో కుకీల ప్రాబల్యం ఉండగా.. బిష్ణుపూర్ జిల్లా మైతీల ఆధిపత్యంలో ఉంది. ఈ రెండు జిల్లాలను విభజించే మధ్య నున్న ‘బఫర్ జోన్’లోని అడవిలోకి వీరు వెళ్లడంతో ఈ దారుణం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. మే 2023 నుంచి మణిపూర్ లో మైతీలు, కుకీల మధ్య ఘర్షణలు చోటు జరుగుతున్నాయి. ఎనిమిది నెలలుగా హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. ఇరువైపులా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ప్రాణ నష్టం కూడా భారీగా నమోదైంది.
పవర్ స్టేషన్ లో ఇంధనం లీక్
మణిపూర్‌లోని కాంగ్‌పోక్పీ జిల్లాలోని లీమాఖోంగ్ పవర్ స్టేషన్‌లో బుధవారం రాత్రి పవర్ స్టేషన్ నుంచి భారీగా ఇంధనం లీక్ అయింది. సమీపంలోని వాగుల్లో ఈ ఇంధనం కలిసిందని ఇది ఇంఫాల్ నదిలోకి చేరుతున్నదని అధికారులు తెలిపారు. దీంతో వాగులు, నదిలోని జలచరాలు, ఈ నీటి వనరులపై ఆధారపడి సాగు చేస్తున్న పొలాలకు నష్టం జరిగేలా ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంపై స్పందించిన మణిపూర్ సీఎంవో “పర్యావరణ విపత్తును నివారించడానికి తక్షణ అవసరమైన చర్యలు తీసుకోవాలి. అందుబాటులో ఉన్న మెషీనరీ, ఎక్స్పర్ట్స్ తదితర అన్ని రకాల వనరులను ఉపయోగించుకోండి” అని అధికారులను ఆదేశించింది. ఈ ప్రమాదంలో తీవ్రవాదుల ప్రమేయం ఉందా లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది.
