బీజేపీ దేశవ్యాప్తంగా జన ఆశీర్వాద యాత్రలు చేపడుతోంది. మంత్రివర్గ విస్తరణలో కొత్తగా నియమితులైన మంత్రులు, ప్రమోషన్లు పొందినవారు ఈ యాత్ర ద్వారా ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జన ఆశీర్వాద యాత్రలో ఓ గుర్రానికి బీజేపీ జెండా రంగులు వేశారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా నిర్వహించిన ఈ యాత్రలో గుర్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అయితే.. కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీకి చెందిన పీపుల్ ఫర్ యానిమల్స్ (PFA) స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించారు. ఇది కచ్చితంగా జంతువులను హింసించడం కిందికే వస్తుందని భావిస్తూ వారు ఇండోర్ లోని సంయోగితా గంజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ అంశాన్ని ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకెళ్లాలని వారు నిర్ణయించారు.
