IND vs SL: మా కెప్టెన్ ఫిట్‌గా బాగానే ఉంది: స్మృతి మంధాన

మహిళల టీ20 ప్రపంచకప్‌లో బుధవారం(అక్టోబర్ 09) కీలక పోరు జరగనుంది. గ్రూప్‌-- ఏలో భాగంగా దుబాయ్‌ వేదికగా బుధవారం రాత్రి టీమిండియా.. శ్రీలంకతో తలపడనుంది. తొలి మ్యాచ్‌లో కివీస్ చేతిలో ఓడి సెమీస్‌ అవకాశాలు సంక్లిష్టం చేసుకున్న హర్మన్ సేన.. ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలవడం తప్పనిసరి. ఈ కీలక పోరులో రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ బరిలోకి దిగుతుందని వైస్ కెప్టెన్ స్మృతి మంధాన స్పష్టం చేసింది. 

గాయంతో రిటైర్డ్ హర్ట్ గా.. 

రెండ్రోజుల క్రితం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ గాయపడింది. స్టంపౌట్ ప్రమాదం నుంచి తప్పించుకునే క్రమంలో వెనక నుంచి డైవ్ చేయగా.. మెడకు గాయమైంది. అనంతరం బ్యాటింగ్ కొనసాగించలేక రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగింది. ఆ గాయం నుంచి ఆమె కోలుకున్నట్లు మంధాన మీడియా సమావేశంలో వెల్లడించింది. బుధవారం శ్రీలంకతో జరగనున్న మ్యాచ్‌లో జట్టుకు నాయకత్వం వహించేందుకు తమ రెగ్యులర్ కెప్టెన్ ఫిట్‌గా ఉన్నారని తెలిపింది.

నెట్‌ రన్‌రేట్‌ కీలకం

పాక్‌పై గెలిచినప్పటికీ భారత్‌ పాయింట్ల పట్టికలో మాత్రం నాలుగో స్థానంలో ఉంది. తొలి మ్యాచ్‌లో కివీస్‌ చేతిలో దారుణంగా ఓడటమే అందుకు ప్రధాన కారణం. 58 పరుగుల భారీ తేడాతో ఓడటంతో భారత నెట్‌ రన్‌రేట్‌ దారుణంగా పడిపోయింది. లంకతో మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తేనే భారత్‌ సెమీస్‌ రేసులో నిలుస్తుంది.

కాగా, ఈ టోర్నీలో ఇప్పటివరకూ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన లంక నేటి పోరులో బోణీ కొట్టాలని చూస్తోంది. ఒకవేళ భారత్‌పైనా ఓడితే ఆ జట్టు ప్రపంచకప్‌ నుంచి అధికారికంగా నిష్క్రమించినట్టే.

ALSO READ | Champions Trophy 2025: భారత్ కోసం కీలక మార్పు.. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు రెండు వేదికలు