హెల్త్ ​ఇన్సూరెన్స్​లకు జనవరి 1 నుంచి కేవైసీ తప్పనిసరి

హెల్త్ ​ఇన్సూరెన్స్​లకు జనవరి 1 నుంచి కేవైసీ తప్పనిసరి

వెలుగు బిజినెస్​ డెస్క్:​ వచ్చే నెల 1వ తేదీ నుంచి కొత్తగా తీసుకునే హెల్త్, మోటార్​, ట్రావెల్​, హోమ్​ ఇన్సూరెన్స్​ పాలసీలకు నో యువర్​ కస్టమర్​ (కేవైసీ) డాక్యుమెంట్లు ఇవ్వడం తప్పనిసరి. ప్రీమియం మొత్తంతో సంబంధం లేకుండా అన్ని ఇన్సూరెన్స్​ పాలసీలకు కేవైసీ డాక్యుమెంట్లను తప్పనిసరి చేస్తూ ఇన్సూరెన్స్​ రెగ్యులేటరీ డెవలప్​మెంట్​ అథారిటీ (ఐఆర్​డీఏ) ఆదేశాలు జారీ చేసింది. లైఫ్, జనరల్​, హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీలకు ఈ కొత్త రూల్​ వర్తిస్తుంది. నాన్​–లైఫ్​ జనరల్​ ఇన్సూరెన్స్​పాలసీల కొనుగోలుకు ఇప్పటిదాకా కేవైసీ తప్పనిసరి కాదు. హెల్త్​, ఆటో, ట్రావెల్​ ఇన్సూరెన్స్​లను నాన్​–లైఫ్​ ఇన్సూరెన్స్​ లేదా జనరల్​ ఇన్సూరెన్స్​ పాలసీలుగా వ్యవహరిస్తారు. హెల్త్​ ఇన్సూరెన్స్​ విషయంలో మాత్రం క్లెయిమ్​ సెటిల్​మెంట్​ టైములో కేవైసీ డాక్యుమెంట్లను అడుగుతున్నారు. క్లెయిమ్​ అమౌంట్​ రూ. లక్ష దాటితే పాలసీదారుడు పాన్​, ఆధార్​ కార్డులను ఇవ్వాల్సి ఉంటోంది. అంటే, ఇకమీదట పాలసీ తీసుకునే టైములోనే కేవైసీ రూల్స్​ను పాటించాల్సి వస్తుందని పాలసీబజార్​.కామ్​ సీఈఓ సర్బ్​వీర్​ సింగ్​ చెప్పారు.

ఇప్పటిదాక వాలంటరీ....

జనరల్​ ఇన్సూరెన్స్​ ప్రొడక్టులు కొనుగోలు చేయడానికి కేవైసీ డాక్యుమెంట్లను ఇవ్వడం ఇప్పటిదాకా వాలంటరీ. కానీ, జనవరి 1, 2023 నుంచి మాత్రం ఇది తప్పనిసరి. ఇప్పటికే పాలసీలను కొనుగోలు చేసిన కస్టమర్ల నుంచి కేవైసీ డాక్యుమెంట్లను నిర్ధారిత గడువులోగా తీసుకోమని ఇన్సూరెన్స్​ కంపెనీలకు ఐఆర్​డీఏ ఆదేశాలు జారీ చేసింది. కేవైసీ డిటెయిల్స్​ను ఎస్​ఎంఎస్, ఈమెయిల్​ రూపంలో ఇవ్వాలని కస్టమర్లను ఇన్సూరెన్స్​ కంపెనీలు కోరతాయని సర్బ్​వీర్​ సింగ్​ పేర్కొన్నారు.​ అయితే, ప్రస్తుత కస్టమర్లకు కేవైసీ డిటెయిల్స్​ ఇవ్వడం తప్పనిసరి మాత్రం కాదని వివరించారు. కానీ, జనవరి 1, 2023 తర్వాత పాలసీ రెన్యువల్​కు వచ్చేటట్లయితే మాత్రం కేవైసీ డిటెయిల్స్​ ఇవ్వక తప్పదు. ఒకవేళ ఇప్పటికే కేవైసీ డిటెయిల్స్​, కాపీలను ఇవ్వకపోయినట్లయితే ఇన్సూరెన్స్​ కంపెనీలను వెంటనే సంప్రదించి, ఇవ్వడం మేలని బజాజ్​ క్యాపిటల్​ ఎండీ సంజీవ్​ బజాజ్​ సూచించారు. కేవైసీ ఇవ్వకపోతే కొత్త ఇన్సూరెన్స్​ పాలసీ కొనుగోలు, పాత పాలసీ రెన్యువల్​లో ఇబ్బందులు ఎదుర్కోవలసి రావచ్చని పేర్కొన్నారు. ఒక ఫైనాన్షియల్​ ఇయర్లో ఇన్సూరెన్స్​ ప్రీమియం మొత్తం రూ. 50 వేలకి మించితేనే కస్టమర్లు ఇప్పటిదాకా పాన్​కార్డు లేదా ఫార్మ్​ 60 ను ఇవ్వాల్సి ఉంటోందని ఐసీఐసీఐ లంబార్డ్​ చీఫ్​ (అండర్​రైటింగ్​ ఆఫ్​ క్లెయిమ్స్) సంజయ్​దత్తా వివరించారు. ఇన్సూరర్ల దగ్గర పాలసీ హోల్డర్ల కేవైసీ వివరాలు అందుబాటులో ఉండటం వల్ల పాలసీల అండర్ రైటింగ్​ సజావుగా జరుగుతుంది. వారు కొనుగోలు చేసే కవరేజ్​కి అర్హత కూడా రికార్డవుతుందని బజాజ్​ పేర్కొన్నారు. అన్నింటికీ మించి, ఇన్సూరెన్స్​ కంపెనీలు సెంట్రలైజ్డ్​ డేటా బ్యాంకును ఏర్పాటు చేయడం కుదురుతుంది. దీర్ఘకాలంలో ఇది అందరికీ మేలు చేస్తుందని సింగ్​ 
చెప్పారు.

పాలసీ హోల్డర్లకు వచ్చే బెనిఫిట్లు....

కేవైసీ డాక్యుమెంట్లు ఉండటం వల్ల కస్టమర్ల గురించిన సమగ్ర సమాచారం ఇన్సూరెన్స్​ కంపెనీలకు అందుబాటులోకి వస్తుంది. దీంతో క్లెయిమ్​ ప్రాసెసింగ్​ వేగంగా జరగడానికి ఛాన్స్​ ఉంటుంది. అంతేకాకుండా, క్లెయిమ్స్​లో ఫ్రాడ్స్​ జరగకుండా, పేమెంట్లన్నీ పాలసీ హోల్డర్ల కు చెందిన  లీగల్​ హెయిర్స్​కే చేరడం సాధ్యమవుతుందని సింగ్​ పేర్కొన్నారు. కొనుగోలు టైములోనే కేవైసీ డాక్యుమెంట్లు ఇవ్వడం వల్ల క్లెయిట్​ టైములో మరోసారి వాటిని ఇవ్వాల్సిన అవసరం కస్టమర్లకు తప్పుతుందని వివరించారు.

ఇన్సూరెన్స్​ కంపెనీలకు కలిగే బెనిఫిట్లు....

పాలసీ హోల్డర్ల కేవైసీ వివరాలు ఉంటే రిస్క్​ ఎసెస్​మెంట్​ మెరుగవడంతోపాటు, పాలసీ రేట్ల నిర్ణయమూ ఇన్సూరెన్స్​ కంపెనీలకు సులభమవుతుంది. మోసపూరిత క్లెయిమ్​లకు చెక్​ పెట్టడమూ వాటికి సాధ్యపడుతుంది.ఓవరాల్​గా కస్టమర్లకు మరింత మెరుగైన సేవలను, అనుభవాన్ని అందేలా చేయడం ఇన్సూరెన్స్​ కంపెనీలకు వీలవుతుందని బజాజ్​వివరించారు.​