‘జనసేనలో చేరుతున్నారట కదా.. నిజమేనా..?’ అని మంచు మనోజ్ను అడగ్గా వచ్చిన సమాధానం ఇది..!

మంచు కుటుంబంలో ఇటీవల జరిగిన పరిణామాలతో మోహన్ బాబు కుటుంబ సభ్యులు తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. మంచు మనోజ్ గురించి తాజాగా జరిగిన ప్రచారం ఏంటంటే.. మంచు మనోజ్, అతని భార్య మౌనిక జనసేనలో చేరుతున్నారని జోరుగా ప్రచారం జరిగింది. మీడియా, సోషల్ మీడియాలో సోమవారం ఉదయం నుంచి ఈ వార్త చక్కర్లు  కొట్టింది. వెయ్యి కార్లతో భారీ ర్యాలీతో రాయలసీమకు ఎంట్రీ ఇచ్చి ఆళ్లగడ్డలో అడుగుపెట్టి శోభమ్మ సమాధి సాక్షిగా జనసేనలో చేరుతున్నట్లు ప్రకటన చేస్తారని మీడియా, సోషల్ మీడియా ఊదరగొట్టింది.

సోమవారం శోభా నాగిరెడ్డి జయంతి(డిసెంబర్ 16-12-2024) కావడంతో మంచు మనోజ్, మౌనిక ఆళ్లగడ్డ వెళ్లిన మాట వాస్తవం. శోభానాగిరెడ్డి సమాధి వద్దకు వెళ్లి నివాళి అర్పించిన విషయం వాస్తవం. కానీ.. వెయ్యి కార్లతో ర్యాలీ, జనసేనలో చేరుతున్నట్లు ప్రకటన చేయనున్నారనే ప్రచారం మాత్రం సోషల్ మీడియా సృష్టించిన కథేనని తేలిపోయింది. మంచు మనోజ్ను ‘‘ఏంటి మీరు జనసేనలో చేరుతున్నారట కదా.. నిజమేనా..?’’ అని ఇదే విషయాన్ని మీడియా అడగ్గా.. ‘నో కామెంట్’ అని మనోజ్ సైలెంట్గా సైడైపోయాడు. 

ALSO READ | వాలెంటైన్స్ డే రోజున వస్తున్న విశ్వక్ సేన్ లైలా..

ఔనని గానీ, కాదని గానీ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. జనసేనలో చేరుతుండొచ్చేమో గానీ అంత హంగామా చేస్తూ జాయిన్ అవడానికి మనోజ్ రాజకీయ పార్టీల్లో యాక్టివ్గా ఉన్న వ్యక్తి కానే కాదు. ఒకవేళ.. జనసేనలో చేరే ఆలోచన ఉంటే పవన్ను నేరుగా కలిసి మనోజ్, మౌనిక పార్టీ కండువా వేసుకుంటారే తప్ప వెయ్యి కార్లతో ర్యాలీ చేసేంత పరిస్థితి ఉండకపోవచ్చు. వెయ్యి కార్లతో ర్యాలీ అంటే సామాన్యమైన విషయం కాదు. సోషల్ మీడియా వచ్చాక గోరంత విషయం.. కొండంత ప్రచారం అన్నట్టుగా పరిస్థితి తయారైంది. మంచు మనోజ్ ఇటీవల మోహన్ బాబుతో విభేదాల కారణంగా వార్తల్లో నిలిచాడు. రాజకీయంగా అడుగులు వేసి వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని భావిస్తున్నాడు.