విష్ణు ఎలాంటి గొడవ చేయలేదు..నా చిన్న కొడుకు మనోజ్ చెప్పేవన్నీ అబద్ధాలు : మంచు నిర్మల

మంచు ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్ నెలకొంది.  ఇప్పటి వరకు మంచు మోహన్ బాబు, విష్ణు, మనోజ్ ఒకరిపై  కంప్లైంట్ లు ఇచ్చుకున్నారు.  పోలీస్ స్టేషన్ మెట్లక్కారు.. ఇద్దరు అన్నదమ్ములకు రాచకొండ సీపీ వార్నింగ్ ఇచ్చారు..ఇంతటితో ఈ   వివాదానికి పుల్ స్టాప్ పడ్డట్లే అనుకున్నారు  అందరు.

అయితే   ఇటీవల మోహన్ బాబు భార్య నిర్మల పుట్టిన రోజు సందర్భంగా మళ్లీ ఈ  వివాదం మొదలైన సంగతి తెలిసిందే.  జల్ పల్లిలోని ఫామ్ హౌస్ లో తన ఫ్యామిలీని చంపేందుకు  కుట్ర పన్నారని..గొడవ చేశారని విష్ణుపై  మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  అయితే ఇపుడు  ఈ సీన్ లోకి  మంచు మోహన్ బాబు భార్య నిర్మల ఎంట్రీ ఇచ్చారు. మంచు మనోజ్ కు వ్యతిరేకంగా పహాడీ షరీఫ్   పోలీసులకు ఓ లేఖ రాశారు. మంచు మనోజ్ చెప్పేవన్నీ అబద్దాలేనని చెప్పారు. ఈ విషయం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. 

 ఇంతకీ మనోజ్ తల్లి నిర్మల పోలీసులకు ఇచ్చిన లేఖలో ఏముందంటే.?  నేను  జల్ పల్లి ఫామ్ హౌస్ లో ఉంటున్నా. డిసెంబరు 14వ తేదీన నా పుట్టినరోజు సందర్భంగా నా పెద్ద కుమారుడు  విష్ణు   జల్ పల్లిలోని ఇంటికి వచ్చి కేకు తీసుకొచ్చి సెలబ్రేట్ చేశాడు.  దీనికి నా చిన్న కుమారుడు మనోజ్.. ఇంటికి వచ్చిన విష్ణు  సీసీ ఫుటేజ్ బయట పెట్టి, దాన్ని విష్ణు గొడవ చేసినట్టు లేనిపోని అభాండాలు వేసి పోలీస్ కంప్లెయింట్ ఇచ్చినట్టు తెలిసింది. నా పుట్టినరోజు సందర్భంగా విష్ణు కేక్ తీసుకుని ఇంటికి వచ్చాడు. తన రూములో ఉన్న సామాను తీసుకుని వెళ్లిపోయాడు. ఉన్న కొద్దిసేపు నాతోటి ఉండి కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేశాడు.  నా చిన్న కొడుకు మనోజ్  కు  ఈ ఇంట్లో ఎంత హక్కు ఉందో, అలాగే నా పెద్ద కొడుకు విష్ణుకి కూడా అంతే హక్కు ఉంది.

Also Read:-కన్నప్పలో కిరాతగా.. మోహన్‌‌లాల్..

  విష్ణు ఎటువంటి దౌర్జన్యంతో కానీ, మనుషులతో కానీ ఇంట్లోకి రాలేదు, గొడవ చేయలేదు. మనోజ్ కంప్లయింట్ చేసిన దానిలో నిజం లేదు. ఈ ఇంట్లో పని చేసే వాళ్ళు కూడా 'మేమిక్కడ పని చేయలేమని', వాళ్ళే మానేసారు.   విష్ణు మా జల్ పల్లి ఇంటికి వచ్చాడు, నా పుట్టిన రోజు సెలబ్రేట్ చేశాడు, విష్ణు గదిలో వున్న తన సామాను తీసుకున్నాడు,వెళ్ళిపోయాడు, అంతకు మించి ఇక్కడ జరిగింది ఏమీ లేదు మీకు తెలియజెస్తున్నాను.ఇందులో విష్ణు ప్రమేయం ఎంతమాత్రం లేదు. అంతకు మించి ఇక్కడ జరిగింది ఏమీ లేదు అని తెలిపారు.

 జల్ పల్లిలోని తన ఇంటికి వచ్చిన విష్ణు.. జనరేటర్‎లో చక్కెర కలిపిన డీజిల్ పోశారని మనోజ్ డిసెంబర్ 15న ఆరోపించారు.   ‘‘నా తల్లి జన్మదిన వేడుకల సందర్భంగా శనివారం రాత్రి విష్ణుతో పాటు అతని అనుచరులు నా ఇంట్లోకి ప్రవేశించారు. కేక్ కట్ చేసే సమయంలో జనరేటర్‎లో చక్కెర కలిపిన డీజిల్ పోశారు. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. మేం రాత్రంతా బిక్కుబిక్కుమంటూ నిద్రపోలేదు. నన్ను చంపేందుకు కుట్ర జరుగుతున్నది” అని అందులో పేర్కొన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు.