సింగరేణి సంఘానికి గుర్తింపు రెండేండ్లా? నాలుగేండ్లా?

  • 8 నెలల తర్వాత ఇయ్యాల సర్టిఫికెట్ల అందజేత
  •  కాలపరిమితి నాలుగేండ్లు ఉండాలంటున్న ఏఐటీయూసీ
  •  రెండేండ్లు చాలనే నిర్ణయంతో ఐఎన్ టీయూసీ 
  •  న్యాయపోరాటం చేస్తామంటున్న గుర్తింపు సంఘం 

గోదావరిఖని/కోల్​బెల్ట్, వెలుగు  : సింగరేణి సంస్థ గుర్తింపు సంఘం ఎన్నికల్లో  గెలిచిన కార్మిక సంఘాలకు రికగ్నైజ్డ్, రిప్రజెంటేషన్​స్టేటస్​సర్టిఫికెట్లు ఇచ్చేందుకు మేనేజ్​మెంట్​సిద్ధమైంది. ఎన్నికలు జరిగిన 8 నెలల తర్వాత సోమవారం ధ్రువీకరణ పత్రాలు అందించేందుకు హైదరాబాద్ లోని​సింగరేణి భవన్​లో ఏర్పాట్లు జరుగుతున్నాయి.  అయితే.. నాలుగేండ్ల కాలపరిమితితో ఇవ్వాలని ఏఐటీయూసీ డిమాండ్​చేస్తోంది. రెండేండ్లతో ఇస్తే న్యాయ పోరాటం చేస్తామంటోంది. ఇక ప్రాతినిధ్య సంఘంగా గెలిచిన ఐఎన్ టీయూసీ మాత్రం రెండేండ్లు చాలనే నిర్ణయంతో ఉంది.

గతేడాది డిసెంబర్ 27న సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయి. అదే రోజు ఫలితాలు ప్రకటించారు. సింగరేణి మొత్తం11 డివిజన్లలో శ్రీరాంపూర్, బెల్లంపల్లి, మందమర్రి, ఆర్జీ -–1, ఆర్జీ -–2 (ఐదు) డివిజన్లలో గెలిచి16,177 ఓట్లతో (43.20 శాతం) ఏఐటీయూసీ ఘన విజయం సాధించింది. కానీ.. కొత్తగూడెం కార్పొరేట్, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు, ఆర్జీ -–3, భూపాలపల్లి (ఆరు) డివిజన్లలో ఐఎన్​టీయూసీ గెలిచినప్పటికీ14,178 ఓట్లతో (37.86 శాతం) రెండో స్థానంలో నిలిచి ప్రాతినిధ్య సంఘానికే పరిమితమైంది.

రెండేండ్ల కాలపరిమితినేనా..?

సింగరేణిలో మాటిమాటికి సంఘాలు సమ్మెలకు పిలుపునిస్తుండడంతో బొగ్గు ఉత్పత్తిపై తీవ్రమైన ప్రభావం చూపుతుండేది. దీంతో 1998 సెప్టెంబర్​9న సంస్థ గుర్తింపు సంఘాలకు ఎన్నికలు నిర్వహించింది.  రెండేండ్ల కాలపరిమితి ఫిక్స్ చేయగా.. ఏఐటీయూసీ గెలిచింది. కాగా.. 2001 నుంచి 2003 దాకా నాలుగేండ్ల కాలపరిమితి పెంచింది. 2007, 2012 ఎన్నికల్లోనూ దీన్నే కొనసాగించింది. 2017లో  తిరిగి రెండేండ్లకు తగ్గించింది. దీంతో అప్పటి ఎన్నికల్లో గెలిచిన టీబీజీకేఎస్​యూనియన్​నాలుగేండ్ల కాలపరిమితి ఉండాలని కోర్టుకు వెళ్లింది. తుది తీర్పు రాలేదు.

కానీ.. 2020లో కరోనా రావడంతో ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. బొగ్గు ఉత్పత్తిపై ఎఫెక్ట్ పడుతుందనే నెపంతో ఎన్నికలు నిర్వహించకుండా ఆరేండ్ల వరకు గుర్తింపు సంఘం కాలపరిమితి పొడిగించింది. 2023 డిసెంబర్​లో రెండేండ్ల కాలపరిమితితో ఎన్నికలు నిర్వహించింది. ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా గెలిచి.. కాలపరిమితిపై పొడిగింపుపై కేంద్ర కార్మిక శాఖను సంప్రదించింది. ఏదైనా సానుకూల నిర్ణయం వస్తుందని ఇంతకాలం వేచిచూసింది. అయినా ఫలితంలేదు. దీంతో రెండేండ్ల కాలపరిమితితోనే అధికారిక పత్రాలను ఇచ్చేందుకు సింగరేణి నిర్ణయించినట్టు తెలుస్తోంది. సర్టిఫికెట్ అందించిన తొలిరోజు నుంచి రెండేండ్ల పాటు ఎన్నికైన సంఘాలు గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలుగా వ్యవహరిస్తాయి. 

గుర్తింపు పొందినా.. సర్టిఫికెట్లు ఇవ్వకపోగా.. 

 ఇప్పటివరకు గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీకి, ప్రాతినిధ్య సంఘంగా ఐఎన్ టీయూసీ అధికారికంగా ధ్రువీకరణ పత్రాలను ఇవ్వలేదు. కార్మిక శాఖ సూచన మేరకు సర్టిఫికెట్లను అందజేసి వాటి ప్రతినిధులకు శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తారు. బొగ్గు గనులపై అనుసరించాల్సిన  విధి విధానాలను వివరిస్తారు. ఇది ఎనిమిది నెలలుగా జరగలేదు. దీంతో  సింగరేణి సీఎండీ, డైరెక్టర్ల స్థాయిలో స్ట్రక్చర్డ్​, జేసీసీ మీటింగ్ లు కూడా లేవు. దీంతో ఆయా సంఘాలు కార్మిక సమస్యలపై చర్చించే చాన్స్ కూడా లేకుండాపోయింది. సింగరేణి ఎన్నికల్లో గెలిచినప్పటికీ పలు సమస్యలను మేనేజ్​మెంట్​వద్ద ప్రస్తావించలే ని పరిస్థితి నెలకొంది. సంస్థ ఏకపక్షంగా జారీ చేసిన సర్క్యూలర్లు ఉద్యోగులు, కార్మికులకు శాపంగా మారినా ఏమీ చేయలేకుండా ఉండిపోయాయి.

న్యాయపోరాటం చేస్తం 

సింగరేణి  కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించి 8 నెలల తర్వాత  గుర్తింపు పత్రం ఇస్తామని సంస్థ ఇప్పుడు పిలిచింది.  రెండేండ్ల కాల పరిమితితో ఇస్తే  ఒప్పుకోం.  గతంలో నాలుగేండ్లు కాల పరిమితి ఇచ్చినట్టుగానే ప్రసుత్తమివ్వాలి. లేదంటే న్యాయపోరాటం చేస్తాం.

 వాసిరెడ్డి సీతారామయ్య,ఏఐటీయూసీ స్టేట్ ప్రెసిడెంట్