‘మన ఇంటి బతుకమ్మ’ సంబురం

  • పాల్గొన్న మంత్రులు కొండా సురేఖ, సీతక్క, ఎమ్మెల్యే రోహిత్, కార్పొరేషన్ ​చైర్మన్లు
  • అలరించిన మంగ్లీ ఆటా, పాట
  • మహిళలకు చీరెల పంపిణీ

మెదక్, వెలుగు: పట్టు చీరలు, బంగారు నగల ధగ ధగలు.. ఉత్సాహంగా మహిళల ఆటలు.. ఉర్రూత లూగించే సింగర్​ మంగ్లీ ఆట పాటల మధ్య మన ఇంటి బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ (ఎంఎస్​ఎస్​వో) ఆధ్వర్యంలో సోమవారం రాత్రి జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలోని గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ లో నిర్వహించిన బతుకమ్మ సంబరాలకు వేలాదిగా మహిళలు తరలి వచ్చారు. 

రాష్ట్ర  దేవాదాయ అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క,  మహిళా కమిషన్​చైర్పర్సన్ శారద, మహిళా, శిశు సంక్షేమ కమిషన్​ చైర్పర్సన్ శోభారాణి, ఆర్యవైశ్య కార్పొరేషన్​ చైర్పర్సన్​ కాల్వ సుజాత హాజరై మహిళలతో కలిసి ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. మెదక్ నియోజకవర్గంలోని మండలాలు, మెదక్​ పట్టణం నుంచి వేలాదిగా తరలివచ్చిమహిళలు బతుకమ్మ ఆడారు. ప్రముఖ సింగర్ మంగ్లీ, ఆమె చెల్లెలు ఇంద్రావతి బతుకమ్మ పాటలతో, డ్యాన్సులతో ఆడి పాడి ఆహుతులను అలరించారు. కళాకారుల పేరిణి నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 

సంస్కృతికి ప్రతీక

మన ఇంటి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న మంత్రులు కొండా సురేఖ, సీతక్క మాట్లాడుతూ.. తెలంగాణా సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండగ అన్నారు. పువ్వులనే దేవుడిగా కొలిచే గొప్ప పండగ అన్నారు. బతుకమ్మ పండగ ప్రజల జీవనంతో ముడిపడి ఉంటుందన్నారు. సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువులన్నీ పూర్తిగా నిండి కళకళ లాడుతున్న సమయంలో బతుకమ్మ పండుగ వస్తుందన్నారు. ప్రకృతిలో దొరికే వివిధ రకాల పువ్వులతో పేర్చిన బతుకమ్మలను చెరువుల్లో నిమజ్జనం చేయడం వల్ల చెరువుల్లోని నీరు శుద్ధి అవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్ద పీట వేస్తోందన్నారు. మహిళలను కోటి శ్వరులను చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందన్నారు.  

మెదక్​ ఎమ్మెల్యే రోహిత్​ రావు మాట్లాడుతూ.. తనను ఎమ్మెల్యేగా గెలిపించుకున్న తర్వాత మొదటి బతుకమ్మ పండగ కావడంతో పెద్ద ఎత్తున నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ప్రతి పండగను  ప్రజలతో కలిసి ఆనందోత్సాహాలతో జరుపుకుంటానన్నారు. ఈ సందర్భంగా ఎంఎస్​ఎస్​వో ఆధ్వర్యంలో బతుకమ్మ పండగకు హాజరైన మహిళలకు చీరలు పంపిణీ చేశారు. కాంగ్రెస్​ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు వాణి దంపతులు, మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్ర పాల్, డీసీసీ  అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, కలెక్టర్ రాహుల్ రాజ్, అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డీవో రమాదేవి, కాంగ్రెస్​ నాయకులు సుప్రభాత్​ రావు, రాంచందర్​గౌడ్​, జీవన్ రావు, రాజేశ్​, వెంకటరమణ, పవన్ పాల్గొన్నారు. 

ప్రకృతికే అందం మన బతుకమ్మ: కలెక్టర్ మనుచౌదరి

సిద్దిపేట రూరల్: ప్రకృతికే అందం మన బతుకమ్మ సంబరం అని కలెక్టర్ మను చౌదరి అన్నారు. సోమవారం కలెక్టర్ ఆఫీస్ ఆవరణలో జిల్లా అధికార యంత్రాంగం నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఆయన పాల్గొని, గౌరీ మాత పూజ నిర్వహించి బతుకమ్మ ఆడారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ.. కలెక్టరేట్ ఆఫీసులో ఆనందంగా పండుగను జరుపుకోవడం సంతోషంగా ఉందని, మహిళా ఉద్యోగులు ఉద్యోగ బాధ్యతలు, ఒత్తిడిని మరిచి ఆనందంగా ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొని కలెక్టరేట్ కు కొత్త శోభను తీసుకువచ్చారన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, డీఆర్​వో నాగరాజమ్మ, జిల్లా అధికారులు దేవకీదేవి, సువర్ణ, శారద, కవిత, అమీనా బేగం పాల్గొన్నారు.