లెక్కల్లో తేడా రావడంతో క్యాషియర్​ కిడ్నాప్

  • ఇద్దరు సీఎంలు తెలుసని టార్చర్ 
  • ఆచూకీ తెలపకుండా ఇంటికి ఫోన్ చేసి బెదిరింపులు
  • పోలీసుల జోక్యంతో విడుదల 

జిన్నారం, వెలుగు: లెక్కల్లో తేడా రావడంతో వైన్​షాపులో క్యాషియర్​గా పనిచేస్తున్న వ్యక్తిని యాజమాన్యం కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టింది. తమకు తెలుగు రాష్ట్రాల సీఎంలు తెలుసని, మొబైల్, బ్యాంక్ స్టేట్​మెంట్, వాట్సాప్  చాటింగ్ అన్ని తీసుకొని విపరీతంగా కొట్టినట్లు తెలుస్తోంది. బాధితుడి కథనం ప్రకారం..  సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం సోలక్ పల్లిలోని  వజ్ర వైన్స్​లో మన్నె వీరేశ్ క్యాషియర్​గా పనిచేస్తున్నాడు. లెక్కల్లో తేడా వస్తోందని అతడిని శనివారం కారులో ఎక్కించుకున్న  యాజమాన్యం బొల్లారంలోని శ్రీదేవి ప్రాజెక్టులోని ఆఫీసుకు తీసుకువెళ్లారు. 

అక్కడ మాట్లాడగా వీరేశ్​ రూ.8 లక్షల వరకు  వాడుకున్నట్లు తేలింది. ఆ డబ్బు తిరిగి చెల్లిస్తానని చెప్పినా వినకుండా రాడ్లు, కట్టెలతో విపరీతంగా కొట్టారు. ఎవరితో చెప్పుకున్న లాభం లేదని, తమకు రెండు రాష్ట్రాల సీఎంలు తెలుసని  టార్చర్ పెట్టారు. ఇంటి నుంచి వీరేశ్​ భార్య ఫోన్ చేయగా..డబ్బులు కట్టకుంటే ఆమెను కూడా  కిడ్నాప్ చేస్తామని బెదిరించారు.  దీంతో  వీరేశ్​ భార్య మమత పోలీసులను ఆశ్రయించింది. దీంతో జిన్నారం సీఐ సుధీర్ కుమార్.. వైన్స్ యాజమాన్యానికి ఫోన్ చేశారు. దీంతో ఆదివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో బాధితుడిని ఠాణా వద్ద వదిలేసి వెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.