కావేరి నదిని పుణ్య నదిగా, జీవనదిగా చూస్తారు కర్ణాటకలో. ఈ నదిని నమ్ముకుని వ్యవసాయం చేస్తారక్కడ. నది గురించి ఈ మధ్య వచ్చిన సర్వే రిపోర్టులు మైసూర్‌కు చెందిన పీఎన్ భరత్ అనే సైక్లిస్ట్‌ను ఆలోచింపజేశాయి. ప్రాణ నది కాలుష్యం కాకుండా తనవంతుగా ఏదైనా చేయాలి అనుకు న్నాడు. అందుకు తన ముందున్న ఒకేమార్గం ఆ విషయం మీద ప్రజల్లో కల్పించడం. అలా అనుకోవడం ఆలస్యం, నదీ పరీవాహక ప్రాంతాల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు మొదలు పెట్టాడు.
కావేరి నది పుట్టిన‘తలకావేరీ’ ప్రాంతం నుంచి కన్యాకుమారి వరకూ క్యాంపెయినింగ్ చేశాడు. నదిని కాపాడటం గురించి అక్కడి ప్రజల్లో అవగాహన కల్పించాడు. ఆ ప్రయత్నంలో భాగంగా మొత్తం 850 కిలోమీటర్లు నడిచాడు. అక్టోబరు 21న తలకావేరి నుండి బయల్దేరిన భరత్ నవంబర్ 14వ తేదీన కన్యాకుమారికి చేరాడు. ‘‘కావేరీ నది కలుషితం కావడానికి ప్రధాన కారణం అడవుల్ని నరకడం. అలాగే నదిలోకి చెత్తా చెదారాలను వదలడం. ఈ విషయాలు నన్ను ఎంతో ఆలోచింపజేశాయి. ఈ పవిత్రమైన నది కలుషితం కావడం నా మనసుకు కష్టంగా అనిపించింది. అందుకే ప్రజల్ని చైతన్య పరిస్తే ఈ సమస్యను కొంతైనా తగ్గించవచ్చు అనుకున్నాను. ముందుగా నదులను కాపాడాలంటే అడవుల్ని కాపాడాలి. రాబోయే తరాలకు నదులు ఎంతో అవసరం. కావేరీ నదిని కాపాడుకునేందుకు అక్కడి ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పాను. రాత్రిళ్లు నడిచేవాడ్ని. పగలంతా ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యేవాడిని. ఈ నడక నాకు అంత కష్టంగా అనిపించలేదు. ఎందుకంటే.. నేను ఒక సైక్లిస్ట్, రన్నర్‌ను . ఎప్పుడూ ఫిట్‌గా ఉంటాను. అందుకని నాకు ఫిజికల్‌గా స్ట్రెయిన్ అనిపించలేదు.
నా బ్యాక్‌ప్యాక్‌లో వాటర్ బాటిల్, ఛత్రి, టిఫిన్ బాక్స్, చిన్నపాటి టెంట్, ఒక జత బట్టలు పెట్టుకున్నాను. తిమ్మిర్లు , కాళ్ల నొప్పులు రాకుండా ప్రతి రోజూ వజ్రాసనం ప్రాక్టీస్ చేశాను. ఎక్కడ ఫుడ్ హోటల్స్ ఉంటే అక్కడ బ్రేక్‌ఫాస్ట్ తిని, పార్సిల్ తీసుకునేవాడిని. ఇదంతా బాగానే నడిచింది. కానీ, కోవిడ్ కారణంగా రూమ్స్ దొరకలేదు. దాంతో రాత్రి ఎక్కడంటే అక్కడ నిద్రపోయాను. బస్టాండ్‌లు, దేవాలయాల్లో సుమారు 6 గంటలు రెస్ట్ తీసుకునేవాడిని. రోజూ 5 నుండి 6 గంటల్లో 20 నుండి 30 కిలోమీటర్లు నడిచేవాడ్ని. ఈ మధ్యే మైసూర్ వచ్చాను. ఇప్పుడు గంగా నదిని కూడా కాపాడేందుకు నడవాలని అనుకుంటున్నాను. గంగా నది 2,000 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఆ పొడవంతా నడుస్తూ క్యాంపెయిన్ చేయడం చాలా కష్టమైన పని. అయినా నేను చేయాలి అనుకుంటున్నా. నాగరికతను, మానవత్వాన్ని అందరూ కాపా డాలి. అది భవిష్యత్తు తరాలకు ఎంతో అవసరం. నదులు, అడవులు బతకాలి. వీటిని కాపాడితేనే భవిష్యత్తు. నదులను రక్షించడం మనందరి కనీస బాధ్యత’ అంటున్నాడు ఈ రివర్ వాకర్.
