హైదరాబాద్ సిటీ రోడ్డుపై పల్టీలు కొట్టి.. తలకిందులుగా పడిన కారు

హైదరాబాద్ సిటీలో ఉదయం ట్రాఫిక్ ఎలా ఉంటుందో తెలుసు కదా.. బీభత్సం.. బంపర్ టూ బంపర్ ట్రాఫిక్ ఉంటుంది.. అలాంటి రోడ్లపై ఓ కారు పల్టీలు కొట్టటం అంటే మాటలా చెప్పండి.. ఊహించటానికి అమ్మో.. అంత పెద్ద యాక్సిడెంటా అంటారు.. ఇలాంటి ఘటనే.. 2024, ఫిబ్రవరి 24వ తేదీ శనివారం ఉదయం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

రంగారెడ్డి జిల్లా నార్సింగి,  గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇబ్రహీంబాగ్, తారామతి బారాదరి రహదారిపై  ఓ కియా కారు అదుపు తప్పి పల్టీ కొట్టింది.  రహదారి ఫుట్ పాత్ పై తలకిందులుగా పడి కారు ధ్వంసమైంది. అదృష్టమేంటంటే.. ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా.. కారులో ఉన్నవారు క్షేమంగా బయటపడటమే. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు స్పల్ప గాయాలయ్యాయి. కారు అద్దాలు పగలగొట్టి ప్రాణాలతో బయటపడ్డాడు డ్రైవర్. 
 
గాయపడ్డ వ్యక్తిని వెంటనే స్థానిక హాస్పిటల్ కు తరలించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకుని కారు ప్రమాదాన్ని పరిశీలించారు పోలీసులు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు చెప్పారు.