ఆధ్యాత్మికం: శక్తి అంటే ఏమిటి.. మనిషికి అది ఎలా వస్తుందో తెలుసా

గాలానికి ఉన్న ఎరను చూసి చేపలు కనీసం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా దాన్ని అందుకుని.. జాలరి సంచికి చేరుతాయి. పక్షులు ధాన్యపు గింజలను చూసి వలలో చిక్కుకుంటాయి. వల మీద వాలితే ప్రాణాలు పోతాయనే చిన్న ఆలోచన వాటికి రాదు. పచ్చగా కనిపిస్తుంది కదా అని పశువులు.. మైదానంలో ఉన్న గడ్డిని వదిలేసి మేయడానికి పొలాల మీద పడతాయి. 

పంట మేసేముందు అవి నిమిషం ఆలోచించినా కాపరి కట్టె దెబ్బలు తప్పించుకోగలుగుతాయి. ఇలా వెనకా, ముందు ఆలోచించకపోవడం వల్లే ఈ భూమ్మీద ఉన్న ఎన్నో ప్రాణులు.. ఆపదలను కొని తెచ్చుకుంటాయి. ఎందుకు ఇలా జరుతుంది? మనిషికి ఉన్న 'బుద్ధి' అనే విశిష్టమైన యోగ్యత ఆ జీవులకు లేకపోవడమే దీనికి కారణం.

దారి వెంట నడుస్తుంటే... ఓ చెట్టుకి కూలీలు వేలాడదీసిన టిఫిన్ బాక్స్ లు కనిపిస్తాయి. ఆకలి కడుపు మండిపోతుంది కదా? అని వెళ్లి మనిషి వాటిని తింటాడా? ఎవరో పరిచయం లేని వ్యక్తి 'తీను' అని ఓ బ్రెడ్ ముక్క ఇస్తే తింటాడా? దాన్ని చేతిలోకి తీసుకొని.. ఇది తింటే మంచిదా? కాదా? దీంట్లో ఏమైనా కలిపి ఇచ్చాడా? దేనికోసం ఇచ్చాడు? అని పలు కోణాల్లో ఆలోచిస్తాడు. 
ఇన్ని ఆలోచించాక.. ఒకవేళ అది తింటే మంచిది కాదనిపిస్తే.. కడుపు మాడిపోతున్నా.. దాన్ని తినే ప్రయత్నం చేయడు. తాత్కాలిక ఆనందాలకు లొంగకుండా... ఆ పని చేస్తే తమపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? దాని వల్ల ప్యూచర్లో ఎలాంటి పరిణామాలు ఉంటాయి? లాంటి విష యాలన్నీ ఆలోచించి.. అనుభవం ఆధారంగా నిర్ణయాలు తీసుకునే శక్తినే 'బుద్ధి' అని చెప్పాచ్చు. తెలుసుకోవాలనే ఉత్సాహం, జిజ్ఞాసలే జ్ఞానార్జనకు మొదటి మెట్టు. 

ఎవరి మనసులో నేర్చుకోవాలనే ఆశ బలంగా ఉంటుందో.. వాళ్ల మెదడు ఒక రకమైన అయస్కాంత గుణాన్ని, శక్తిని పొందుతుంది. దీని వల్ల అనుకున్న దాన్ని అదంతట అదే లాగుతూ ఉంటుంది. డాక్టర్​కి ప్రతిచోట పేషెంట్లే కనబడతారు. అంటే మన మెదడు దేన్ని ఆకర్షిస్తుందో.. దానికి అనుకూలమైనదే... మన దరికి చేరుతుంది. ఈ విశ్వం అంతా... జ్ఞానంతో నిండి ఉంది. ఎవరికి ఎంత జిజ్ఞాస ఉంటే... అంతే జ్ఞానంలభిస్తుంది. నదిలో అనంతమైన నీరు ప్రవ హిస్తుంటుంది. మీ దగ్గర చెంబు ఉంటే చెంబెడు, మీ దగ్గరబిందె ఉంటే.. బిందెడు ముంచుకుంటా రు. అంటే మీకు నేర్చుకోవాలన్న తపనే.. మీరు పొందాలనుకుంటున్న జ్ఞానానికి అవధి!

–వెలుగు.. లైఫ్​–