17 సంవత్సరాల క్రితమే మర్డర్.. కట్ చేస్తే యూపీలో ప్రత్యక్షం.. పాల్ విషయంలో అసలేం జరిగింది..?

లక్నో: 17 సంవత్సరాల క్రితమే హత్యకు గురి అయ్యాడు. అతడిని చంపిన కేసులో నలుగురు వ్యక్తులు జైలుకు కూడా వెళ్లారు. సీన్ కట్ చేస్తే..  సరిగ్గా 17 సంవత్సరాల తర్వాత హత్యకు గురి అయినట్లు పోలీసులు చెప్పిన వ్యక్తి ఉత్తరప్రదేశ్‎లో ప్రత్యక్షం అయ్యాడు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‎లోని ఝూన్సీలో జనవరి 6వ తేదీన పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సమయంలో ఓ వ్యక్తి అనుమానస్పదంగా కనిపించడంతో అతడిని అదుపులోకి తీసుకున్న విచారించారు. 

అతడిని బీహార్‌లోని డియోరియాలో నివసిస్తున్న నాథుని పాల్ (50)గా గుర్తించిన పోలీసులు.. గత ఆరు నెలలుగా ఝాన్సీలో ఉంటున్నట్లు స్థానికుల ద్వారా తెలుసుకున్నారు. నా చిన్నతనంలోనే నా తల్లిదండ్రులు మరణించారు. నా భార్య చాలా కాలం క్రితం నన్ను విడిచిపెట్టింది. నేను బీహార్‌లోని నా ఇంటికి వెళ్లి 16 సంవత్సరాలు అయ్యిందని అతడు విచారణలో పోలీసులకు తెలియజేశాడు. దీంతో నాథుని పాల్ గురించి ఝూన్సీ పోలీసులు ఎంక్వైరీ చేయగా.. షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. 

ALSO READ | కులులో ప్యారాగ్లైడింగ్ చేస్తూ హైదరాబాద్ టూరిస్టు మృతి..

2009లోనే నాథుని పాల్ హత్యకు గురి అయ్యాడని.. ఆస్తి కోసం అతడిని బంధువులే హత్య చేసినట్లు బీహార్‎లో కేసు నమోదైనట్లు ఝాన్సీ పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా.. నాథుని పాల్ హత్య చేశాడన్న ఆరోపణలపై అతడి బంధువులు నలుగురు జైలుకు వెళ్లి.. ప్రస్తుతం బెయిల్‎పై బయట ఉన్నారని పోలీసులు తెలుసుకున్నారు. నాథుని పాల్ విషయం అతడి కుటుంబ సభ్యులకు తెలియజేశారు పోలీసులు. 

17 సంవత్సరాల క్రితమే హత్యకు గురి అయ్యాడన్న నాథుని పాల్ బతికున్నాడని తెలియగానే వారు షాకుకు గురి అయ్యారు. నాథుని పాల్‎ను హత్య చేసిన కేసులో జైలుకెళ్లిన ఆయన మామ సతేంద్ర పాల్ ఈ విషయం తెలుసుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. చివరకు ఈ హత్య కేసులో తాము నిర్దోషులమని తేలిందని ఎమోషనల్ అయ్యారు.  నాథుని పాల్‌ను బీహార్ పోలీసులకు అప్పగించారు ఝూన్సీ పోలీసులు. 

అసలు నాథుని పాల్ విషయంలో ఏం జరిగింది..? అతడు 17 సంవత్సరాలు కనిపించకుండా ఎక్కడికి పోయాడు..? ఝూన్సీలో ఎలా ప్రత్యక్షం అయ్యాడన్న దానిపై బీహార్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు పాల్ కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బతికున్న ఓ వ్యక్తి కేసులో నలుగురిని జైలుకు పంపారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తప్పుడు సాక్ష్యాలతో నలుగురిని జైలుకు పంపిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.