రంగారెడ్డి జిల్లాలో దారుణం.. అప్పు ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వమంటే చంపేస్తారా..!

రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని షమా కాలనీలో దారుణ హత్య జరిగింది. సైఫ్ అలియాస్ సాబెర్ అనే వ్యక్తిని తలపై బండ రాయితో మోది కిరాతంగా హతమార్చారు. వివరాల ప్రకారం.. మృతుడు సాబెర్, ఇస్మాయిల్ దగ్గరి బంధువులు. ఈ క్రమంలోనే సాబెర్ ఇస్మాయిల్‎కు రూ.2 లక్షలు అప్పుగా ఇచ్చాడు. అప్పుగా ఇచ్చిన డబ్బులు ఇవ్వాలని సాబెర్ ఇస్మాయిల్‎ను అడిగాడు. శనివారం రాత్రి ఇద్దరు కలిసి మద్యం సేవించారు. 

ఈ సమయంలో అప్పు విషయంలో ఘర్షణ జరగడంతో ఆగ్రహానికి గురైన ఇస్మాయిల్ సాబెర్ తలపై బండరాయితో కొట్టి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఆదివారం తెల్లవారుజూము 4 గంటల ప్రాంతంలో హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. సాబెర్ హత్యపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.