ఎన్నికల సమగ్రతను దెబ్బతీసే కుట్ర.. బీజేపీ కుట్రలను తిప్పికొడతాం: ఖర్గే

న్యూఢిల్లీ: ఎన్నికల సమగ్రతను దెబ్బతీసేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ఓ పద్ధతి ప్రకారం.. ఎన్నికల సంఘాన్ని నిర్వీర్యం చేస్తున్నదని మండిపడ్డారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నదని ఫైర్ అయ్యారు. ఎన్నికలకు సంబంధించిన ఎలక్ట్రానిక్‌‌‌‌ డాక్యుమెంట్లయిన సీసీ టీవీ, వెబ్ కాస్టింగ్ ఫుటేజీ, అభ్యర్థుల వీడియో రికార్డులు తనిఖీ చేసేందుకు అనుమతించే నిబంధనల్లో ఈసీ మార్పులు చేయడాన్ని ఖర్గే తప్పుబట్టారు. ఎన్డీయే కుట్రలకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. 

‘‘రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుంటాం. బీజేపీ కుట్రలను తిప్పికొడ్తాం. కేంద్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నది. ఎన్నికల కమిషన్‌‌‌‌ను నిర్వీర్యం చేయడానికి ఇంతకు ముందు ఎన్నికల కమిషనర్లను నియమించే సెలక్షన్ ప్యానెల్ నుంచి సీజేఐని తొలగించారు. ఓ పద్ధతి ప్రకారం కుట్రకు పాల్పడుతున్నది. తమ తప్పులు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నది. ఏ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా.. నిబంధనల ఉల్లంఘనలపై ఎన్నికల కమిషన్​కు లేఖ రాస్తూనే ఉంటాం.

అయినా.. ఎవరూ స్పందించరు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే ఎన్నికల సంఘం పని చేస్తున్నది. స్వయంప్రతిపత్తి కలిగిన ఈసీ.. కేంద్రం చేతిలో కీలుబొమ్మ అయిపోయిందని మరోసారి రుజువైంది. ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లు మిస్ యూజ్ అవుతున్నాయన్న కారణం చూపి ఈసీ అధికారాలను కేంద్రం కట్టడి చేయడం సరికాదు’’అని ఖర్గే మండిపడ్డారు. ఓట్ల తొలగింపు, ఈవీఎంల విషయంలో పారదర్శకత, ఎన్నికల కోడ్ ఉల్లంఘనల వంటి అంశాలపై ఈసీఐకి గతంలో చాలా సార్లు కాంగ్రెస్ కంప్లైంట్ చేసిందని గుర్తు చేశారు. 

ఎన్నికల నిర్వహణ నిబంధనలు 1961లోని రూల్‌‌‌‌ 93(2)(ఏ)ను కేంద్ర న్యాయశాఖ సవరించడాన్ని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరామ్ రమేశ్ తీవ్రంగా ఖండించారు. ఈ విషయంలో కోర్టుకు వెళ్తామన్నారు. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్నదని పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్​ అరోపించారు.