ఎస్సీ వర్గీకరణను రద్దు చేయాలి: ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి

వనపర్తి టౌన్, వెలుగు: మాల, మాదిగలను విడదీసే ఎస్సీ వర్గీకరణను రద్దు చేయాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా నాయకులు కోరారు. శనివారం జిల్లా కేంద్రంలోని జై భీమ్  స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కృష్ణ, నిరంజనయ్య, కురుమూర్తి, రంజిత్ కుమార్, దశరథం, వెంకటస్వామి మాట్లాడుతూ గతంలో టీడీపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను తీసుకురాగా, హైకోర్టు కొట్టి వేసిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసి దేశంలోని రాష్ట్రాలకు సూచనలు ఇవ్వాలని కోరారు. 

ఎస్సీలను విభజించాలనే కుట్రతోనే బీజేపీ ప్రభుత్వం మాదిగలతో కుమ్మక్కై సుప్రీంకోర్టుకు తప్పుడు నివేదికలు ఇచ్చి, ఎస్సీ వర్గీకరణ చేసుకునేలా తీర్పు వచ్చేలా చేసిందని ఆరోపించారు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని వెంటనే రద్దు చేసుకుని మాల, మాదిగ కులాల్లో చిచ్చు పెట్టవద్దని కోరారు. అనంతరం మాల మహానాడు,  ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో జరిగే బహిరంగ సభ కోసం సన్నాహక సమావేశం నిర్వహించారు. వనపర్తి జిల్లాలోని మండల కమిటీలను ఏర్పాటు చేసుకున్నారు.