దళితులను విభజిస్తే సహించేది లేదు .. సింహగర్జన వేదికగా మాలల హెచ్చరిక

  • క్రీమిలేయర్​ పేరు చెప్పి రిజర్వేషన్లు ఎత్తేస్తే ఊరుకోం
  • మాపై దుష్ప్రచారాన్ని ఎండగడ్తాం
  • దళితుల చైతన్యాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ కుట్రలు
  • ఎస్సీల కోసం ఇన్నాళ్లూ ప్రధాని మోదీ చేసిందేంది? 
  • రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవాలన్న సుప్రీం తీర్పు రాజ్యాంగ విరుద్ధం
  • మాదిగల అభివృద్ధిని మేం అడ్డుకోవడం లేదు
  • పార్లమెంట్​ ద్వారానే వర్గీకరణ జరగాలి
  • ఆత్మగౌరవం కోసం ఎంతవరకైనా పోరాడ్తామని డిక్లరేషన్​
  • పరేడ్​ గ్రౌండ్​లో సభకు భారీగా తరలివచ్చిన మాలలు

హైదరాబాద్​, వెలుగు: దళితులను విభజించేందుకు కుట్రలు జరుగుతున్నాయని.. క్రీమిలేయర్​ పేరు చెప్పి రిజర్వేషన్లను ఎత్తేసేందుకు ప్రయత్నిస్తున్నారని సింహగర్జన వేదికగా మాలలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్రలను సహించేది లేదని, చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. రాష్ట్రంలో మాలల జనాభా తక్కువగా ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదని.. ఆత్మగౌరవం కోసం ఎంత వరకైనా పోరాటం చేస్తామన్నారు. ఆదివారం సికింద్రాబాద్​లోని పరేడ్​ గ్రౌండ్​లో మాలల సింహగర్జన సభ జరిగింది. 

సభకు మాలలు లక్షలాదిగా తరలివచ్చారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు ప్రవేశపెట్టారు. బాబా సాహెబ్​ అంబేద్కర్​ లక్ష్యాలకు తిలోదకాలు ఇచ్చేందుకు కొందరు కులతత్వ, మతతత్వ శక్తుల చేతుల్లో పావులుగామారి కుట్రలు చేస్తున్నారని.. భారత రాజ్యాంగ మూల సూత్రాలకు భంగంవాటిల్లే ఏ చర్యనైనా తాము అంగీకరించబోమని తేల్చిచెప్పారు. రాజ్యాంగంలోని 341 ఆర్టికల్ ప్రకారం ఎస్సీ వర్గీకరణ చెల్లదని.. ఎస్సీల్లో ఏ కులమైనా వెనుకబడితే వారికి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని 2004 లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని గుర్తుచేశారు. 

 గత 20 ఏండ్లలో పాలకులకు ఈ విషయం ఎందుకు గుర్తుకురాలేదని మాలలు నిలదీశారు. ఎస్సీ వర్గీకరణ జరగాలంటున్న ప్రధాని నరేంద్ర మోదీ.. ఇన్నేండ్ల ఆయన పాలనలో దళితుల కోసం ఏం చేశారని.. కనీసం మాదిగల కోసమైనా ఏం చేశారని ప్రశ్నించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ మీటింగ్ లో ముఖ్య అతిథిగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి పాల్గొన్నారు. 

ALSO READ | సంక్రాంతి తర్వాత రైతు భరోసా .. ఈ అసెంబ్లీ సమావేశాల్లో విధివిధానాలు ఖరారు చేస్తం: సీఎం రేవంత్​

నాగర్​కర్నూల్​ ఎంపీ మల్లు రవి, పెద్దపల్లి ఎంపీ  గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే లు మేడిపల్లి సత్యం, గడ్డం వినోద్, ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్, ఢిల్లీ మాజీ మంత్రి రాజేందర్ పాల్ గౌతమ్, అంబేద్కర్​ రాష్ట్రీయ ఏక్తామంచ్​ జాతీయ అధ్యక్షుడు భవన్ నాథ్​ పాశ్వాన్, మాజీ మంత్రి శంకర్ రావు, ఏపీ నేత మహాసేన రాజేశ్​, ప్రముఖ గాయకుడు రెంజర్ల రాజేశ్​, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య తదితరులు హాజరయ్యారు. తెలంగాణతో పాటు ఏపీ నుంచి కూడా లక్షలాది మంది మాలలు వచ్చారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ మీటింగ్ జరిగింది. మధ్యలో 10 నిమిషాలు వర్షం ఆటంకం కలిగించినప్పటికీ సభ కొనసాగింది. 
 
20 ఏండ్లు ఏం చేశారు? 

ఎస్సీ వర్గీకరణపై రాష్ట్రాలకు అధికారం ఉందంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని డిక్లరేషన్​లో మాలలు పేర్కొన్నారు. ఈ తీర్పును నిరసిస్తున్నట్లు ప్రకటించారు. ‘‘2004లో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్​ ఇచ్చింది. 341 ఆర్టికల్ ప్రకారం వర్గీకరణ చెల్లదని నాడు సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఎస్సీల్లో ఏకులమైనా, కొన్ని కులాలైనా ఎదుగుదలకు నోచుకోకపోతే.. వారికోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపట్టాలని న్యాయస్థానం సూచించింది. చిత్తశుద్ధి ఉంటే  గత 20 ఏండ్లు ఉన్న ప్రభుత్వాలు ఈ విషయాన్ని ఎందుకు పట్టించుకోలేదు” అని ప్రశ్నించారు.  

అన్నం, అధికారం, ఐశ్వర్యాలకన్నా ఆత్మ గౌరవానికి విలువనిచ్చే వాళ్లం మాలలమని.. ఈ సభనే అందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. ‘‘దళితుల మధ్య  చిచ్చుపెట్టిన శక్తుల కుట్రలను తిప్పి కొట్టడానికి ఇక్కడ ఏకమయ్యాం. అసత్యాలను ప్రచారంచేస్తున్న శక్తుల కండ్లు తెరిపించడానికి, దళితుల అణగారిన వర్గాల ఐక్యతను నిలుపడానికి మాలల శక్తిని ప్రదర్శించాలనుకున్నం” అని తెలిపారు. మాదిగలను మాలలు దోచుకున్నట్లు నిస్సిగ్గుగా కొందరు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 

రాష్ట్రంలో మాల, మాదిగల ప్రగతిలో మాదిగలే ముందున్నారని.. పదేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయ పథకాల్లో మాలల శాతం
కన్నా మాదిగలే ఎక్కువగా లబ్ధిపొందారని పేర్కొన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇటువంటి పరిస్థితే ఉందన్నారు. ‘‘30 ఏండ్లుగా మాల జాతిమీద జరుగుతున్న దుష్ప్రచారాన్ని మనం తిప్పికొట్టాలి. మాదిగల రక్షకుడిగా చెప్పుకుంటున్న నాయకుడు ఏనాడూ వాళ్ల ఆర్థిక సామాజిక అభివృద్ధిని పట్టించుకోలేదు. సమాజ విద్వేషాలకు, వివక్షకు,  వెలివేతలకు బలైన మాలలపై పచ్చిఅబద్ధాలు ప్రచారం చేస్తున్నడు” అని తెలిపారు  

పార్లమెంట్​ ద్వారా జరగాలిఇటీవల జరిగిన లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ సాధారణ మెజారిటీ కూడా సాధించలేకపోయిందని.. దీనికి దేశవ్యాప్తంగా ఉన్న అంబేద్కర్ వాదులు అనుసరిస్తున్న దళితజాతి కులాల చైతన్యమే కారణమని మాలలు పేర్కొన్నారు. ఈ చైతన్యాన్ని దెబ్బతీయడానికి, ఐక్యతను చెరపడానికి బీజేపీ కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు. వర్గీకరణ ఉద్యమనేతను అడ్డుపెట్టుకొని దక్షిణ భారత రాష్ట్రాల్లో అధికారాన్ని చేపట్టాలని తహతహలాడుతున్నదని ఆరోపించారు.

 బీజేపీ  హర్యానాలో మినహా తాను అధికారంలోఉన్న ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రలో వర్గీకరణ కోసం ఎటువంటి ప్రయత్నాలు చేయడంలేదు. ఆ రాష్ట్రాల్లో ఛమార్, మహార్ లు వర్గీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు” అని అన్నారు.  వర్గీకరణను, మాదిగల అభివృద్ధిని తాము అడ్డుకోవడంలేదని, అది పార్లమెంట్​ ద్వారా జరగాలని ముందు నుంచి కోరుతున్నామని డిక్లరేషన్​లో పేర్కొన్నారు.  

మాలల సింహగర్జన సభ తీర్మానాలు

  • రాష్ట్రంలో గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో భూములున్న ఎస్సీ కులాలవారికి గిరిజనుల మాదిరిగానే  తమ భూమిపై పట్టా హక్కులు కల్పించాలి.
  • ప్రభుత్వరంగంలో ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నందున ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు జరపాలి.
  • దళితుల సామాజిక, ఆర్థిక, అభివృద్ధి కోసం సబ్ ప్లాన్ నిధులను నూటికి నూరుపాళ్లు ఖర్చు చేయాలి. రాష్ట్రంలో ఉన్నచట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి.
  • మాల దళిత యువతీ, యువకులందరికీ వృత్తి నైపుణ్యాలను అందించి, ఉద్యోగావకాశాలు కల్పించాలి. 
  • వృత్తి విద్య, విదేశీ విద్య కోసం ఎంతమంది దరఖాస్తు చేస్తే, అంత మందికి పూర్తి ఫీజు చెల్లించి వారి ఉన్నత విద్యకు ప్రోత్సహించాలి.
  • మాలలు వ్యవసాయాభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్నందున వారికి ప్రభుత్వ భూములను కేటాయించి, వారి వ్యవసాయాభివృద్ధికి పాటుపడాలి.
  • ఎస్సీ కూలల్లో ఇప్పటివరకు ప్రభుత్వ ప్రయోజనాలను పొందనివారిని గుర్తించడానికి, వారి కోసం ప్రత్యేక అభివృద్ధి పథకాల రూపకల్పన కోసం సిట్టింగ్ జడ్జితో కమిషన్ ఏర్పాటు చేయాలి.
  •  కేంద్ర ప్రభుత్వం అమలుచేయనున్న మహిళా బిల్లులో ఎస్సీ, ఎస్టీ మహిళలకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి. 
  • ఆదాయ పరిమితి ఎస్సీ, ఎస్టీలకు  10 లక్షలకు పెంచాలి. 

రిజర్వేషన్లు ఎత్తేసే కుట్ర:‌‌‌‌ రాజేందర్ పాల్

రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని ఢిల్లీ మాజీ మంత్రి రాజేందర్ పాల్ గౌతమ్ అన్నారు. ‘‘ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగానికి వ్యతిరేకం. సుప్రీంకోర్టుకు కేంద్రం సరైన వివరాలు అందించలేదు. ఎస్సీ ఉపవర్గీకరణ పేరుతో మనల్ని మోసం చేయాలని కేంద్రం ప్రయత్నిస్తున్నది. మనలో మనకు కొట్లాట పెట్టాలని చూస్తున్నది. మన రిజర్వేషన్ల మీద దెబ్బ కొడుతున్నది. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాడాలి. మన ఉనికిని కాపాడుకోవాలి” అని పిలుపునిచ్చారు.

సభ ఎవరికీ వ్యతిరేకం కాదు: కాంబ్లీ 

సింహగర్జన సభ ఎవరికీ వ్యతిరేకం కాదని రాజకీయ విశ్లేషకులు కాంబ్లీ అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేశాకే, తెలుగు రాష్ట్రాల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు. మాలలు దోచుకున్నారంటూ మంద కృష్ణ మాట్లాడుతున్నారని, ఏం దోచుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు.

రాజ్యాంగం కల్పించిన ఎస్సీ రిజర్వేషన్లను కులాలవారీగా ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉందంటూ గత ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ మూల సూత్రాలకు విరుద్ధం. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను శాశ్వతంగా ఎత్తివేసే కుట్రలో భాగమే ఇది. ఆ తీర్పును సింహగర్జన సభ ద్వారా నిరసిస్తున్నం.

డిక్లరేషన్​లో మాలలు