హైదరాబాద్, వెలుగు: బంగారం, వజ్రాల ఆభరణాలు అమ్మే రిటెయిల్ చెయిన్ మలబార్ గోల్డ్ సిటీలోని సోమాజిగూడలో ఈ నెల 27 న కొత్త స్టోర్ ఓపెన్ చేయనుంది. నగర వారసత్వాన్ని ప్రతిఫలించేలా ఈ స్టోర్ ఉంటుందని, కస్టమర్లకు మంచి షాపింగ్ అనుభవాన్ని ఇస్తుందని మలబార్ గోల్డ్ వెల్లడించింది. మొదటి ఆర్టిస్ట్రీ షోరూమ్‌గా ఇది పేరొందుతుందని పేర్కొంది. కొంత మంది ఎంపిక చేసిన కస్టమర్లకు షోరూమ్ సందర్శనకు ఈ నెల 15 నుంచే అనుమతిస్తున్నట్లు తెలిపింది. 25 వేల అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన కొత్త స్టోర్‌లో హస్త కళా నైపుణ్యంతో తీర్చిదిద్దిన బంగారు, వజ్రాలు, ప్లాటినం, వెండి ఆభరణాలు ఎక్కువ సంఖ్యలో ఉంటాయని మలబార్ గోల్డ్ వివరించింది. పెళ్లి కూతుళ్ల ముస్తాబుకు ప్రత్యేక ఆభరణాలు ఉంటాయని, వీఐపీ కస్టమర్ల కోసం సెపరేట్ లాంజ్‌లు ఏర్పాటు చేశామని పేర్కొంది. డిజిటల్ స్క్రీన్లు ఉంటాయని, విశాలమైన పార్కింగ్ సదుపాయాన్నీ అందుబాటులోకి తెస్తున్నామని మలబార్ గోల్డ్ వెల్లడించింది. అన్ని వర్గాల కస్టమర్ల అవసరాలను ఈ మొదటి ఆర్టిస్ట్రీ స్టోర్ నెరవేరుస్తుందని మలబార్ గ్రూప్ చైర్మన్ ఎం పీ అహమ్మద్ చెప్పారు. బ్రాండ్ అంబాసిడర్ తమన్నా భాటియాతో రూపొందించిన కొత్త టెలివిజన్ ప్రకటనలనూ త్వరలో మలబార్ గోల్డ్ విడుదల చేయనుంది. హైదరాబాద్‌లో గోల్డ్ రిఫైనరీ ఏర్పాటుకు రూ. 750 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు మలబార్ గ్రూప్ ఇప్పటికే ప్రకటించింది.
