అమిత్ షాను బర్తరఫ్ చేయండి .. మాల మహానాడు నేతల డిమాండ్

హైదరాబాద్, వెలుగు: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్.అంబేద్కర్ ను అవమానించేలా మాట్లాడిన కేంద్ర మంత్రి అమిత్ షాను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని మాలల ఐక్యవేదిక, మాల సంఘాల జేఏసీ, మాల మహానాడు నేతలు డిమాండ్ చేశారు. రిజర్వేషన్లను ఎత్తేసే కుట్రను కేంద్రం చేస్తోందని నేతలు మండిపడ్డారు. అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా సోమవారం నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస్ ముట్టడికి మాల మహానాడు రాష్ర్ట అధ్యక్షుడు చెన్నయ్య ఆధ్వర్యంలో  నేతలు యత్నించగా గాంధీ భవన్ దగ్గర పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ చేశారు. 

ఈ సందర్భంగా నేతలు మాట్లాడారు. దళితులను విడదీసే కుట్ర చేస్తున్న బీజేపీకి ప్రజా క్షేత్రంలో బుద్ధి చెబుతామని నేతలు హెచ్చరించారు. అమిత్ షా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించాలన్నారు. మంత్రి పదవికి అమిత్ షా రాజీనామా చేయాలని లేకపోతే ఆందోళనలు తీవ్ర తరం చేస్తామని చెన్నయ్య హెచ్చరించారు. అంబేద్కర్ రాజ్యాంగం వల్లే అమిత్ షా హోం మంత్రి అయ్యారని పేర్కొన్నారు.