న్యూఢిల్లీ: తన ఆల్టర్నేటివ్ అకాడమేషన్ వ్యాపారాన్ని మరింత విస్తరించడంలో భాగంగా ఆన్‌లైన్ ట్రావెల్ కంపెనీ మేక్ మై ట్రిప్ వచ్చే ఏడాది మరో 10 వేల ప్రాపర్టీల్లో తన సేవలను అందించనుంది. విల్లాలు, అపార్ట్‌మెంట్లను, హోమ్‌స్టేలు, గెస్ట్‌హౌజ్‌లు, హోటళ్ల వంటి వాటిని ఆల్టర్నేటివ్ అకాడమేషన్‌గా పిలుస్తారు. కంపెనీకి ప్రస్తుతం దేశవిదేశాల్లో 1.70 లక్షల ప్రాపర్టీలు ఉన్నాయి. ఆల్టర్నేటివ్ అకాడమేషన్ సెగ్మెంట్‌లో రాబోయే 12 నెలల్లో రెండంకెల వృద్ధి సాధించగలమని మేక్ మై ట్రిప్ సీఓఓ విపుల్ ప్రకాశ్ ఆశాభావం ప్రకటించారు. ఆల్టర్నేటివ్ అకాడమేషన్ ప్లాట్‌ఫామ్‌లో తమకు 4.4 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారని, ఈ మార్కెట్లో ఎన్నో అవకాశాలు ఉన్నాయని చెప్పారు. కార్పొరేట్ కస్టమర్లు వసతి విషయంలో కొత్తదనాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. ప్రస్తుతం తమకు గోవా, కూర్గ్, వయనాడ్, లోనావాలా, సిమ్లా, డార్జిలింగ్, ఊటీ, అలెప్పీ, మెట్రో నగరాల్లో ఆల్టర్నేటివ్ అకాడమేషన్లు ఉన్నాయని వివరించారు. అంతర్జాతీయ నగరాల విషయానికి వస్తే, దుబాయి, సింగపూర్, బాలి, కౌలాలాంపూర్, లండన్, పారిస్, బెర్లిన్, అమ్‌స్టర్‌డామ్, మెల్‌బోర్న్, సిడ్నీ, లాస్ వేగస్, న్యూయార్క్, హోచిమిన్, హనోయ్ వంటి నగరాల్లో ఆల్టర్నేటివ్ అకాడమేషన్లు ఉన్నాయి. ఇండియాలో మొత్తం 25 వేల ప్రాపర్టీలను ఈ కంపెనీ సొంతం చేసుకుంది.

