పాట్నా: బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఎన్డీయేను వీడి మహాగట్బంధన్‌లో చేరాలని విపక్ష ఆర్జేడీ కోరింది. అరుణాచల్ ప్రదేశ్‌లో జేడీ (యూ)కు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేల్లో ఆరుగుర్ని బీజేపీ చేర్చుకుంది. ఈ నేపథ్యంలో జేడీయూ బీజేపీతో దోస్తీని తెగదెంపులు చేసుకోవాలని బిహార్ మాజీ అసెంబ్లీ స్పీకర్, ఆర్జేడీ సీనియర్ నేత ఉదయ్ నారాయణ్ చౌధరి అన్నారు. నితీశ్ కుమార్ మహాగట్బంధన్‌లో చేరి, బిహార్ సీఎం పీఠాన్ని తేజస్వీ ప్రసాద్ యాదవ్‌కు అప్పగించాలని.. అప్పుడు విపక్ష కూటమి నుంచి నితీశ్‌ను ప్రధాన మంత్రి అభ్యర్థిగా చేస్తామని తెలిపారు. ‘చిన్న పార్టీలంటే బీజేపీకి నచ్చదు. వాటిని నాశనం చేయాలన్నదే బీజేపీ టార్గెట్. ఎన్డీయే నుంచి జేడీ (యూ) తప్పుకోవాలన్నదే బీజేపీ కోరికగా కనిపిస్తోంది. ఎన్డీయే నుంచి బయటకు రావాలని నిశీశ్‌ను కోరుతున్నాం. ఆర్జేబీ ఒకసారి నితీశ్ కుమార్‌ను సీఎంను చేసింది. కాబట్టి తేజస్వీని సీఎంగా చేసి నితీశ్ తన గొప్ప మనసును చాటుకోవాలి. ఇప్పుడు నితీశ్ ఢిల్లీపై ఫోకస్ చేయాలి. విపక్షాలను ఆయనే ముందుండి నడపాలి’ అని ఉదయ్ పేర్కొన్నారు.
