ఔటర్ రింగ్ రోడ్పై ఘోర రోడ్డు ప్రమాదం.. నుజ్జునుజ్జయిన కారు

రంగారెడ్డి జిల్లా: రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హిమాయత్ సాగర్ ఔటర్ రింగు రోడ్డుపై డివైడర్ను కారు ఢీ కొట్టింది. డివైడర్ను ఢీ కొట్టి ఔటర్ రింగ్ రోడ్పై నుంచి డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి కింద పడ్డాడు. ఈ ఘటనలో డ్రైవింగ్ చేస్తున్న కారు ఓనర్ స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయాడు.  పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చెట్ల పొదల్లో పడ్డ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వ్యక్తిని L V ప్రసాద్ ఐ ఆసుపత్రిలో డాక్టర్గా పనిచేస్తున్న నిలయ రెడ్డిగా పోలీసులు గుర్తించారు.

ఔటర్ రింగ్ రోడ్డు ప్రమాదాల అడ్డాగా మారుతోంది. ప్రమాదాల నివారణ కోసం పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా అవి సత్ఫలితాలను ఇవ్వడం లేదు. ఇందుకు కారణం అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్. ఇలా వరుస రోడ్డు ప్రమాదాలతో ఓఆర్ఆర్పై ప్రయాణం అంటేనే వాహనదారులకు వణుకుపుడుతోంది. 

ప్రయాణాలు సులువుగా చేయడానికి, హైదరాబాద్ లోపల రద్దీని తగ్గించడానికి, త్వరగా గమ్యం చేరడానికి ఏర్పాటైన ఓఆర్ఆర్​ ప్రమాదాలకు నిలయంగా మారుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. రింగ్ రోడ్డుపై జరుగుతున్న ప్రమాదాలతో ఏటా అనేకమంది మృత్యువాత పడుతున్నారు. అతి వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వంటి కారణాలతో ప్రమాదాలు జరుగుతున్నట్టు పోలీసుల పరిశీలనలో వెల్లడైంది.