సిద్దిపేట జిల్లాలో ప్రాజెక్టులకు జలకళ

  • సిద్దిపేట జిల్లాలో నిండుకుండల్లా రిజర్వాయర్లు 
  • ఇప్పటివరకు 35 టీఎంసీల నీటి నిల్వ
  • యాసంగి పంటలకు ఢోకా లేనట్టే

సిద్దిపేట, వెలుగు: జిల్లాలోని ప్రధాన రిజర్వాయర్లు నిండుకుండల్లా మారాయి. ఎల్లంపల్లి నుంచి నీటిని ఎత్తిపోయడంతో రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లలో నీళ్లు గరిష్ట స్థాయికి చేరాయి. ప్రస్తుతం మూడు ప్రధాన రిజర్వాయర్లలో కలిపి దాదాపు 35 టీఎంసీల పై చిలుకు నీరు నిల్వ ఉంది. చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ వద్ద గల రంగనాయ సాగర్ పూర్తి సామర్థ్యం 3 టీఎంసీలు కాగా ప్రస్తుతం  2.85 టీఎంసీల నీరు నిల్వ ఉండగా రెండు పంపుల ద్వారా నీటిని ఎత్తి పోస్తున్నారు.

రంగనాయక సాగర్ నుంచి మల్లన్న సాగర్ రిజర్వాయర్ కు నీటిని విడుదల చేస్తున్నారు. తొగుట మండలం తుక్కాపూర్ వద్ద గల మల్లన్న సాగర్ రిజర్వాయర్  పూర్తి సామర్థ్యం 50 టీఎంసీలు కాగా  ప్రస్తుతం 21  టీఎంసీల నీరు నిల్వ ఉంది.  నాలుగు  పంపుల ద్వారా రిజర్వాయర్ లోని  నీటిని ఎత్తి పోస్తుండగా నెల రోజుల్లో 6 టీఎంసీల నీటిని కొండపోచమ్మ రిజర్వాయర్ కు తరలించారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్ 2020 మే నెలలో  ట్రయల్ రన్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మొత్తం 59.41 టీఎంసీల నీటిని తరలించారు.

2020-–21 లో  9.91 టీఎంసీ, 2021–-22 లో 20.25, 2022–-23లో 7.46, 2023–-24లో 4.29, 2024 ఈ రోజు వరకు 21 టీఎంసీలు తరలించారు. ములుగు మండలం ఎర్రవల్లి వద్ద గల కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 15 టీఎంసీలు కాగా ప్రస్తుతం11  టీఎంసీల నీరు నిల్వ ఉండగా ఇటీవల రిజర్వాయర్ లోకి నీటి పంపింగ్ ను నిలిపి వేశారు.

యాసంగి పంటలకు పుష్కలంగా నీళ్లు

జిల్లాలోని మూడు ప్రధాన రిజర్వాయర్లలో గరిష్ట స్థాయిలో నీరు నిల్వ ఉండటంతో వచ్చే యాసంగి పంటలకు ఢోకా లేదు. మూడు రిజర్వాయర్ల ప్రధాన కాల్వల నుంచి రైతుల పొలాలకు నీటిని అందించే అవకాశం ఉండడంతో రైతులు సంబరపడుతున్నారు. మేడి గడ్డ నుంచి ఎత్తిపోతలు నిలిచిపోవడంతో రెండు నెలల కింది వరకు రిజర్వాయర్లలో నీటి మట్టాలు కనిష్ట స్థాయికి చేరడంతో రైతులు ఆందోళన చెందారు.

ఇదే సమయంలో ఊహించని విధంగా ఎల్లంపల్లి వరద నీటిని మిడ్ మానేరు, అన్నపూర్ణ రిజర్వాయర్  మీదుగా జిల్లాలోని మూడు ప్రధాన రిజర్వాయర్లకు మళ్లించారు. వర్షాకాలం చివరలో ఆశించిన మేర వానలు కురవడంతో రిజర్వాయర్లలోకి నీరు భారీగా చేరి తాగు, సాగు నీటికి ఇబ్బందులు తొలగిపోయాయి. భవిష్యత్​లో ఎల్లంపల్లి నుంచి జిల్లాలోని రిజర్వాయర్లకు నీటిని మళ్లించే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు చెబుతుండడం విశేషం.