- మన్మోహన్ సంతాప తీర్మాన సభకూ హాజరుకాని ప్రధాన ప్రతిపక్ష నేత
- కేసీఆర్‌కు సభ గౌరవం ఇవ్వలేదన్న హరీశ్‌రావు
- మన్మోహన్సింగ్ సంతాపంపైనే మాట్లాడాలని శ్రీధర్‌బాబు సూచన
- ప్రొఫెసర్ జయశంకర్‌కు, దేశిని చినమల్లయ్యకు ఏం గౌరవం ఇచ్చారని హరీశ్‌కు మంత్రి పొన్నం ప్రశ్న
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎర్ర వల్లి ఫాంహౌస్‌కే పరిమితమైన బీఆర్ఎస్అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కీలక సందర్భాల్లోనూ బయటకు రావడం లేదు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానం కోసం సోమవారం నిర్వహించిన అసెంబ్లీ సమావేశాలకు సైతం ఆయన హాజరుకాలేదు. ప్రధాని హోదాలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించిన మన్మోహన్సింగ్ కడసారి చూపుకోసం కేసీఆర్ ఢిల్లీ వెళ్తారని అందరూ భావించినా.. ఆయన మాత్రం ఫాంహౌస్‌లోనే ఉండిపోయారు. పార్టీ తరఫున వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను పంపించి, చేతులు దులుపుకొన్నారు. సోమవారం మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానం కోసమే నిర్వహించిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి కేసీఆర్ రాకపోవడం చర్చకు దారితీసింది. సంతాప తీర్మానం సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ, పదే పదే కేసీఆర్ పేరు ప్రస్తావించగా.. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత కేసీఆర్‌కు తాను స్వయంగా ఫోన్ చేసి సమావేశానికి ఆహ్వానించినా.. ఆయన హాజరుకాలేదని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు.
దీనిపై హరీశ్‌రావు మాట్లాడుతూ.. ‘ఈ సభ కేసీఆర్‌కు ఏం గౌరవం ఇచ్చింది సార్.. సభ సభలా నడవడం లేదు.. పీఏసీ చైర్మన్ పై మీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయం తీసుకున్నారు. పీఏసీ చైర్మన్ ఎంపిక విషయంలో ప్రతిపక్ష నేతకు కనీస గౌరవం ఇవ్వలేదు. ఎమ్మెల్యేల అనర్హత వేటు విషయంలో మీరు నిర్ణయం తీసుకున్నారా ?’ అని స్పీకర్‌ను ఎదురు ప్రశ్నించారు. దీంతో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు కలగజేసుకొని, ఇది మన్మోహన్ సింగ్‌కు సంబంధించిన సంతాప తీర్మానం అని, ఇక్కడ కూడా అవసరం లేని సబ్జెక్ట్‌ను తీసుకువచ్చి మాట్లాడడం సరికాదని, సబ్జెక్ట్ డీవియేట్ కావొద్దని హరీశ్‌రావుకు సూచించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కేసీఆర్ అంటే తమకు గౌరవం ఉన్నదని, కానీ ఇప్పుడు సభలో లేని కేసీఆర్ గురించి చర్చ ఎందుకు అని ప్రశ్నించారు. మీ హయాంలో దేశిని చినమల్లయ్యకు, ప్రొఫెసర్ జయశంకర్ కు ఏం గౌరవం దక్కిందో అనేది కూడా చర్చ జరగాలా? అని హరీశ్‌రావును నిలదీశారు. దయచేసి మన్మోహన్ సింగ్ సంతాపం గురించి మాట్లాడితే మంచిదని సూచించారు.
ఏడాదిలో ఒక్కసారే సభకు
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నది. ఈ కాలంలో ఒక్కరోజు.. అదీ బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యారు. అప్పుడు కూడా ఆయన ఏమీ మాట్లాడలేదు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందడంతో ఆయనకు నివాళి అర్పించి.. సంతాప తీర్మానం చేసేందుకు అసెంబ్లీ సోమవారం ప్రత్యేకంగా సమావేశమైంది. తెలంగాణ సాకారానికి మన్మోహన్ కృషి ఎంతో ఉందని పలు సందర్భాల్లో కేసీఆర్ స్వయంగా చెప్పారు. ఆయన తనకు ఆప్తుడని కూడా పేర్కొన్నారు. దీంతో ఈ సమావేశానికి కేసీఆర్ హాజరై, తెలంగాణ ఉద్యమ సమయంలో మన్మోహన్సింగ్ఇచ్చిన ప్రోత్సాహం, తెలంగాణ ఏర్పాటు వెనుక ఆయన కృషి గురించి వివరిస్తారని అందరూ ఆశించారు. కానీ ఎప్పట్లాగే ఈ ప్రత్యేక సమావేశానికి కూడా కేసీఆర్ రాలేదు. మన్మోహన్ సింగ్ మరణవార్త తెలిశాక కూడా కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి భౌతికకాయాన్ని సందర్శించడమో, మన్మోహన్కుటుంబ సభ్యులను పరామర్శించడమో చేయలేదు. ప్రధాన ప్రతిపక్షనేతగా ఉన్న కేసీఆర్.. అసెంబ్లీకి వచ్చి వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశమున్నా వినియోగించుకోవడం లేదు. కొద్దినెలలుగా కనీసం మీడియాతో కూడా మాట్లాడడం లేదు. సభలోనూ, సభ బయటా కేటీఆర్, హరీశ్ రావు తోనే ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలు చేయిస్తూ తాను సైలెంట్‌గా ఉంటున్నారు. కనీసం మన్మోహన్ సింగ్‌లాంటి వ్యక్తుల సంతాప తీర్మానం కోసం కూడా సభకు కేసీఆర్ రాకపోవడంపై బీఆర్ఎస్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతున్నది.