Ranji Trophy 2024-25: RTM కార్డు ఇతనికే: ట్రిపుల్ సెంచరీతో దుమ్మలేపిన RCB బ్యాటర్

ఐపీఎల్ మెగా ఆక్షన్ కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ మహిపాల్ లోమ్రోర్ ట్రిపుల్ సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. రంజీ ట్రోఫీలో రాజస్థాన్ తరపున ఆడుతున్న ఈ యువ క్రికెటర్ ఉత్తరాఖండ్ పై ట్రిపుల్ సెంచరీ చేశాడు. 83 స్ట్రైక్ రేట్‌తో కేవలం 360 బంతుల్లో 300 పరుగులు చేయడం విశేషం. అతని ఇన్నింగ్స్ లో 25 ఫోర్లు, 13 సిక్సర్లు ఉన్నాయి. అతని ఇన్నింగ్స్ తో రాజస్థాన్ తమ తొలి ఇన్నింగ్స్ లో 700 పరుగుల మార్క్ అందుకుంది.  

2024 ఐపీఎల్ సీజన్ లో లోమ్రోర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాడు. అతన్ని 2025 ఐపీఎల్ సీజన్ కోసం రిటైన్ చేసుకోలేదు. అతని ట్రిపుల్ సెంచరీతో ఆర్సీబీ ఈ యువ ఆటగాడిని RTM కార్డు ఉపయోగించి తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఐపీఎల్ లో ఆర్సీబీ తరపున మహిపాల్.. 10 మ్యాచ్‌ల్లో 183 స్ట్రైక్ రేట్ తో 125 పరుగులు మాత్రమే చేశాడు. మిడిల్ ఆర్డర్ లో పవర్ హిట్టర్ కోసం వెతుకుతున్న ఆర్సీబీ.. ఈ యువ ఆటగాడిని తీసుకుంటుందో లేదో చూడాలి. సౌదీ అరేబియాలోని జెడ్డాలో నవంబర్ 24, 25 తేదీల్లో ఐపీఎల్ మెగా ఆక్షన్ జరుగుతుంది. 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల వివరాలను ఇటీవలే వెల్లడించింది. టీమిండియా స్టార్ బ్యాటర్, ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, యంగ్ బ్యాటర్ రజత్ పాటిదార్, బౌలర్ యశ్ దయాల్‎ను ఆర్సీబీ రిటైన్ చేసుకుంది. విరాట్ కోహ్లీకి రూ.21 కోట్లు, రజత్ పాటిదార్‎కు రూ.11 కోట్లు, యశ్ దయాల్‎కు రూ.5 కోట్లు చెల్లించింది. ఈ ముగ్గురి కోసం ఆర్సీబీ తమ పర్స్‎లోని రూ.37 కోట్లు కేటాయించింది. మిగిలిన రూ.83 కోట్లతో ఆర్సీబీ మెగా వేలానికి వెళ్లనుంది.