టీజీపీఎస్సీలో మహేందర్ రెడ్డి మార్క్

  • కమిషన్​లో భారీగా సంస్కరణలు
  • నోటిఫికేషన్లకు అడ్డంకి లేకుండాఐటీ సెల్, లీగల్​ సెల్​ ఏర్పాటు
  • 12 వేల పోస్టుల రిక్రూట్ మెంట్ పూర్తి 
  • సక్సెస్​ఫుల్​గా గ్రూప్​–1​ పరీక్షల నిర్వహణ
  • 62 ఏండ్ల వయస్సు పూర్తి..  చైర్మన్​గా రిలీవ్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ)  చైర్మన్ గా 10 నెలలపాటు పనిచేసిన ఐపీఎస్​ ఆఫీసర్​మహేందర్ రెడ్డి విధి నిర్వహణలో తనదైన మార్క్​ చూపించారు. గ్రూప్ –1​లాంటి కీలకమైన పరీక్షలను సజావుగా  నిర్వహించడం ద్వారా  ప్రశంసలు పొందారు. సోమవారంతో ఆయనకు 62 ఏండ్లు పూర్తికాగా, టీజీపీఎస్సీ చైర్మన్ బాధ్యతల నుంచి  రిలీవ్ అయ్యారు. కాగా.. నేడో, రేపో కొత్త చైర్మన్ గా బుర్ర వెంకటేశం బాధ్యతలు స్వీకరించనున్నారు. 

జనవరి 25న బాధ్యతలు స్వీకరించిన మహేందర్​రెడ్డి

కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి రాగానే.. టీజీపీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేసింది. చైర్మన్ జనార్దన్ రెడ్డి సహా సభ్యులందరితో రాజీనామా చేయించింది. జనవరి 25న కమిషన్​ కొత్త టీమ్​ను ప్రకటించింది. టీజీపీఎస్సీ చైర్మన్​గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డితోపాటు మరో ఐదుగురు సభ్యులను నియమించింది. ఈ పదినెలల కాలంలో చైర్మన్​గా పనిచేసిన మహేందర్​రెడ్డి కమిషన్​లో కీలక సంస్కరణలు చేపట్టారు. ప్రధానంగా పోటీ పరీక్షల నిర్వహణలో పారదర్శకతకు పెద్దపీట వేశారు.  టీజీపీఎస్సీ ఫిబ్రవరి నుంచి నవంబర్ వరకు 5 పరీక్షలు నిర్వహించింది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత తొలి గ్రూప్– 1 పరీక్షను విజయవంతంగా నిర్వహించడంలో మహేందర్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. 

Also Read : అప్పుల కిస్తీలు, మిత్తీలకే 64,516 కోట్లు

గతంలో 2 సార్లు వాయిదా పడ్డ తర్వాత రద్దయి..మళ్లీ పరీక్ష పెట్టడం కమిషన్ కు సవాల్​గానే నిలిచింది. అయినా.. మహేందర్​రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టి నోటిఫికేషన్ నుంచి మెయిన్స్ నిర్వహణ వరకూ జాగ్రత్తగా పరీక్షలను నిర్వహించి, సర్కారు పెద్దల మన్ననలు పొందారు. గ్రూప్–1 ప్రిలిమినరీ, మెయిన్స్​తోపాటు  గ్రూప్– 3, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, డీఏవో పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు. 2,562 పోస్టుల భర్తీకి నిర్వహించిన ఈ పరీక్షలకు 7,14,144 మంది అటెండ్ అయ్యారు. ఈ పది నెలల కాలంలో 21 నోటిఫికేషన్లకు సంబంధించిన 13,121 పోస్టుల్లో 12,403 పోస్టుల రిక్రూట్​మెంట్​ ప్రక్రియ పూర్తి చేశారు. జేఎల్, పాలిటెక్నికల్ లెక్చరర్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నది. 

ఐటీ సెల్, లీగల్ సెల్ ఏర్పాటు

 ఇటీవలి కాలంలో టీజీపీఎస్సీ నుంచి ఏ నోటిఫికేషన్ వచ్చినా హైకోర్టు మెట్లు ఎక్కుతున్నాయి. ఈ క్రమంలో న్యాయ వివాదాలను వేగంగా పరిష్కరించేందుకు టీజీపీఎస్సీ తరఫున ఫుల్ టైమ్ లా ఆఫీసర్​ ను, నలుగురు లీగల్ కన్సల్టెంట్లను చైర్మన్ మహేందర్ రెడ్డి నియమించారు. గతంలో ఐటీ వ్యవస్థ బలహీనంగా ఉండడంతో పేపర్లు లీక్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఐటీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఐటీసెల్​లో చీఫ్ ఇన్ఫర్మేషన్ అధికారి, చీఫ్ ఐటీ సెక్యూరిటీ ఆఫీసర్​ను నియమించారు. మానవ తప్పిదాలు జరగకుండా ఫలితాల వెల్లడిలో ఆటోమేషన్ ప్రాసెసింగ్ ను తీసుకొచ్చారు. దీంతో గ్రూప్ –4 ఫలితాలు, రిక్రూట్​మెంట్​ ప్రక్రియ వేగంగా పూర్తయింది. గ్రూప్ –1లో అభ్యర్థుల వివరాలతో కూడిన ఓఎంఆర్ షీటును ఇవ్వగా, వందశాతం బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకున్నారు. కమిషన్ పనితీరును మెరుగుపర్చేందుకు సిబ్బందికి 55 అంశాలపై ట్రైనింగ్ ఇచ్చారు. దీనికితోడు సర్కారు పెద్దలతో మాట్లాడి కమిషన్​లో ఖాళీగా ఉన్న 142 పోస్టులను మంజూరు చేయించారు.