మహబూబ్​నగర్​కు విద్యా నిధి

  • డోనర్స్​ సహకారంతో ఫండ్స్​ సేకరణ
  • కలెక్టర్​ ఆధ్వర్యంలో స్కీమ్​ నిర్వహణ
  • నేటి నుంచి అమలు 

మహబూబ్​నగర్​, వెలుగు :  పాలమూరు జిల్లాలో విద్యాభివృద్ధికి మహబూబ్​నగర్​ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​ రెడ్డి స్పెషల్​ ఫోకస్​ పెట్టారు.  ‘మహబూబ్​నగర్​ విద్యా నిధి’  స్కీమును కలెక్టర్​ ఆధ్వర్యంలో  శుక్రవారం నుంచి అందుబాటులోకి తెచ్చారు. దీని ద్వారా పేద విద్యార్థులకు  ఆర్థిక సాయం అందించనున్నారు.  

కలెక్టర్​ ఆధ్వర్యంలో నిర్వహణ

'మహబూబ్​నగర్​ విద్యా నిధి' స్కీము కోసం ప్రత్యేకంగా కలెక్టరేట్​ కాంప్లెక్స్​లో  ఎస్​బీఐ అకౌంట్​  ను తెరిచారు. దాదాపు 50 ఏండ్ల పాటు ఈ  స్కీము కొనసాగేలా  చూస్తున్నారు.  కలెక్టర్​ ఆధ్వర్యంలో చీఫ్​ ప్లానింగ్​ ఆఫీసర్​ (సీపీవో) స్కీమును నిర్వహిస్తారు. 

చదువుకు సాయం.. 

ఫస్ట్​  నుంచి టెన్త్​ వరకు, ఇంటర్​, డిగ్రీ, ఆపై ఉన్నత చదువులు చదువుకునే వారికి అవసరం మేరకు ఆర్థిక సహాయం చేస్తారు. స్పోర్ట్స్​, కల్చరల్​ యాక్టివిటిస్​లో పాల్గొనే పేద విద్యార్థులకు కూడా ఆర్థిక చేయూతను అందిస్తారు. 

అందరి భాగస్వామ్యంతో 

స్కీముకు మున్సిపాల్టీ పరిధిలోని ప్రముఖులు, బిజినెస్​మెన్లు, ఉన్నత చదువులు చదువుకున్న వారి నుంచి డొనేషన్​లు స్వీకరించనున్నారు.   ఎవరెవరికి ఆర్థిక సహాయం చేయాలనే దానిపై ఓ కమిటీని వేయనున్నారు. ఈ కమిటీలు ఉన్నత చదువుల కోసం, ఇతర రంగాల్లో రాణించడానికి ఆర్థిక సాయం కోసం వచ్చే అప్లికేషన్​లను పరిశీలిస్తాయి. అనంతరం ప్రత్యేకంగా సమావేశమై అవసరం ఉన్న వారికి ఆర్థిక సహాయం అందిస్తాయి. ఎమ్మెల్యే యెన్నం తన జీతం నుంచి ప్రతి నెలా రూ.లక్ష ఈ నిధిలో జమ చేయనున్నట్లు ప్రకటించారు. ఐదేండ్ల పాటు రూ.50 లక్షల వరకు తన జీతం నుంచి నిధికి ఇవ్వనున్నట్లు చెప్పారు. 

రెండు వార్డులకు ఒక లెర్నింగ్​ సెంటర్​

మహబూబ్​నగర్ టౌన్​లో ఎడ్యుకేషన్​ను డెవలప్​ చేసేందుకు లెర్నింగ్​ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. రెండు వార్డులకు కలిసి ఒక లెర్నింగ్​ సెంటర్​ ఏర్పాటు చేసేలా  ప్రణాళికలు రూపొందించారు. ఈ సెంటర్లు సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడున్నర గంటల వరకు నడుపనున్నారు.  డిగ్రీ, బీఈడీ, టీటీసీ, ఇతర పై చదువులు చదువుకొని పిల్లలకు ట్యూషన్​లు చెప్పడానికి ఇంట్రెస్ట్​ ఉన్న వారి నుంచి అప్లికేషన్​లు తీసుకోనున్నారు.    

ఎడ్యుకేషన్​లో నంబర్​ వన్​ కావాలి

సరస్వతి నిలయమైన పాలమూరులో పదేండ్లుగా విద్యా ప్రమాణాలు తగ్గిపోయాయి. పేరుకు మాత్రమే కాస్త అక్షరాస్యత పెరిగింది. కానీ చదువుల్లో ఎలాంటి డెవలప్​మెంట్​ సాధించలేదు. రంగారెడ్డి జిల్లాతో పోల్చితే ఉపాధి, ఉద్యోగ  అవకాశాల్లో పాలమూరు చాలా వెనుకబడి ఉంది. ఎడ్యుకేషన్​లో పాలమూరు జిల్లాను స్టేట్​లోనే నంబర్​ వన్​గా నిలుపాలనే టార్గెట్​తో పని చేస్తున్నాం. అందుకే ఎడ్యుకేషన్​ డెవలప్​మెంట్​పై ఫుల్​ ఫోకస్​ పెట్టాం.
- యెన్నం శ్రీనివాస్​ రెడ్డి, ఎమ్మెల్యే, మహబూబ్​నగర్​