ఎన్నికల బరిలో నుండి తప్పుకున్న మహాసేన రాజేష్..!

టీడీపీ, జనసేన కూటమి ప్రకటించిన ఉమ్మడి అభ్యర్థుల జాబితాలో మహాజన రాజేష్ కి పీ, గన్నవరం నుండి టికెట్ అనౌన్స్ చేయటం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అతనికి టికెట్ కేటాయించిన మరుక్షణమే అటు టీడీపీ, ఇటు జనసేనలో నిరసనలు మొదలయ్యాయి. గతంలో రాజేష్ చేసిన హిందూ వ్యతిరేక వ్యాఖ్యల వల్ల అతనికి టికెట్ రద్దు చేయాలని హిందూ సంఘాలు కూడా నిరసనకు దిగాయి. సోషల్ మీడియాలో కూడా అతనికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తడంతో చేసేదేమీలేక తానే స్వయంగా ఈ ఎన్నికల్లో పోటీ నుండి తప్పుకుంటున్నా అని ప్రకటించాడు.

రాజేష్ కి టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత అంబాజిపేటలో అతను నిర్వహించిన మీటింగ్ లో కూడా టీడీపీ, జనసేన శ్రేణులు నిరసన తెలియజేశాయి. రాజేష్ మీద చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేశారు. ఎట్టకేలకు హిందూ సంఘాల నుండి వచ్చిన తీవ్ర వ్యతిరేకతకు తలొగ్గిన రాజేష్ పోటీ నుండి తప్పుకుంటున్నా అని ప్రకటించాడు. దీంతో పి. గన్నవరం స్థానానికి మరో అభ్యర్థిని వెతికే పనిలో పడింది టీడీపీ అధిష్టానం.