‘మహా’ సంగ్రామంలో ‘పద్మ’వ్యూహం

కూటములకు పార్టీలు కట్టుబడనట్టే, పార్టీలకు సామాజిక వర్గాలు కట్టుబడిలేని మహారాష్ట్ర.. అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమైంది. 2 కూటముల కింద, 6 పార్టీలు ప్రధానంగా తలపడుతున్న ‘మహా’రణక్షేత్రమిది. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్​ ఆయా కూటముల్లో ఒదిగిపోయాయి. 288 స్థానాల అసెంబ్లీలో సర్కారు ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ నంబర్ 145 ఏ ఒక్క పార్టీకి లభించే అవకాశం లేక,  రెండు ‘మహా’కూటములుగా పార్టీలు జట్లు కట్టాయి. 

జాతీయ పార్టీలకు దీటుగా ప్రాబల్యమున్న శివసేన, ఎన్సీపీలు నిలువునా చీలి, అవే పేర్లతో  రెండేసి పార్టీలయ్యాక తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు ఎదుర్కొంటున్నాయి. ఈ ఎన్నిక తర్వాత వారిలో ఒకరొకరే మిగలొచ్చేమో! చిన్న పార్టీల పాత్రా ఈ ఎన్నికల్లో కీలకమే!  కూటముల్లో మిత్రులకు ఎవరెంత మేలు లేదా కీడు చేస్తారనే  పరిణామాల్ని బట్టే ఆయా పార్టీల బలం, కూటముల గెలుపోటములు తేలేది.  దేశ ఆర్థిక రాజధాని ముంబయి కలిగిన మహారాష్ట్ర ఎన్నికలపై... దేశవ్యాప్తంగా అందరికీ ఆసక్తే!

మహారాష్ట్ర  అసెంబ్లీ ఎన్నికల ప్రకటన వెలువడింది.  నవంబరు 20న పోలింగ్, 23న ఫలితాలు.  రెండు ప్రధానమైన జాతీయ కూటముల మధ్య పోరు నువ్వా-నేనా  అన్నట్టుంది. ఫలానా కూటమికి ఆధిక్యత లభిస్తుందని ఇప్పుడే చెప్పలేని అనిశ్చితి ప్రజాక్షేత్రంలో ఉంది. కేంద్రంలో  పాలకపక్షం ఎన్డీఏ  తరఫున బీజేపీ, శివసేన (ఏక్​నాథ్ షిండే),  -ఎన్సీపీ (అజిత్ పవార్) ‘మహాయుతి’గా జట్టు కడితే, ‘ఇండియా శిబిరం’ నుంచి కాంగ్రెస్, శివసేన (ఉద్దవ్ ఠాక్రే), ఎన్సీపీ (శరద్​పవార్)లు ‘మహా వికాస్ అఘాడి ‘ఎమ్వీఏ’ కూటమిగా బరిలో నిలుస్తున్నాయి.  

2019  అసెంబ్లీ  ఎన్నికల్లో  కలిసి పోటీ చేసిన బీజేపీ, -శివసేనలు ఫలితాల తర్వాత సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయగల స్థితిలో ఉండీ (161/288) విభేదాలతో  విడిపోయాయి. తర్వాతి నాటకీయ పరిణామాల్లో.. శివసేన వెళ్లి  కాంగ్రెస్-, ఎన్సీపీలతో  జట్టుకట్టడంతో ‘ఎమ్వీఏ కూటమి’  ప్రభుత్వం ఏర్పాటైంది.  తర్వాత..శివసేన,  ఎన్సీపీల్లో   చీలికతో   కొత్త కూటమి  ఏర్పడి, బలపడింది.  అలా బీజేపీతో  కలిసి  ఏర్పడ్డ  ‘మహాయుతి’  కూటమి  సర్కారే  ప్రస్తుతం పాలనలో ఉంది.  

ఈ బంధాలు ఫలితాల తర్వాత నిలిచేనా?

కాంగ్రెస్ అధినేత్రి  సోనియా గాంధీ అభీష్టానికి భిన్నంగా మహారాష్ట్రలో ఎమ్వీఏ  కూటమి ఏర్పడి  సర్కారును ఏర్పరచింది. ‘బీజేపీతో సఖ్యత చెడింది, మనవైపు చూస్తున్నారు, శివసేనతో మనం జట్టు కడదామా?’ అని, టెన్- జనపథ్​లో  ఎన్సీపీ నేత శరద్​పవార్  ఒక ప్రతిపాదన పెట్టారు. వారు కూర్చున్నచోట  గోడపైనున్న  నెహ్రూ,  ఇందిర,  రాజీవ్​గాంధీ చిత్రపటాల వైపు తదేకంగా చూస్తూ, ‘నో,  మన లౌకికతత్వం ఏం కావాలి?’ అన్నారు సోనియా!  పవార్ ఆమెకు  నచ్చజెప్పజూసినా అడుగు ముందుకుపడే సూచన కనిపించలే!  తర్వాత, శివసేన బంధం బీజేపీతో పూర్తిగా తెగాక,  పార్టీ నాయకత్వంపై  కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఒత్తిడి పెరిగింది. ‘మీరు కుదరదంటే మేం పార్టీ వీడి, దిక్కున్న చోటికి వెళతాం’ అని చేసిన హెచ్చరికకు  కాంగ్రెస్ నాయకత్వం దిగివస్తేనే ‘ఎమ్వీఏ’ ఏర్పడింది. 

నిలువునా చీలిన శివసేన, ఎన్సీపీ

తర్వాత పరిణామాల్లో శివసేన నిలువునా చీలి (జూన్ 2022) ఎక్​నాథ్​ షిండే నేతృత్వంలోని బృందం బీజేపీతో  చేతులు కలపడంతో  కొత్త సర్కారు కొలువుతీరింది.  షిండేను  సీఎం చేసి, వందకు పైగా స్థానాలున్న పెద్దపార్టీ బీజేపీ, ఉప ముఖ్యమంత్రి (ఫడ్నవీస్) పదవికి పరిమితమై వ్యూహాత్మకంగా వ్యవహరించింది.  జులై 2023లో ఎన్సీపీ నిలువునా చీలి, అదే ప్రభుత్వంలో అజిత్​ పవార్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. చీలికవర్గ సభ్యుల్ని అనర్హులుగా ప్రకటించమని ఉద్దవ్ ఠాక్రే, శరద్​ పవార్​ న్యాయస్థానాల్ని సంప్రదించడం, చీలికవర్గాల్నే అసలు పార్టీలుగా అవి గుర్తించడం తెలిసిందే!  

మహాయుతి ఒకవైపు  ఎమ్వీఏ  మరోవైపు 2024 ఎన్నికల్లో  పోరాడాయి. చీలికలను ప్రజలు తిరస్కరించడం వల్లనేమో, 2019 ఫలితాలను తారుమారు చేస్తూ ఎమ్వీఏ ఆధిక్యత సాధించింది. 48 లోక్​సభ స్థానాలకుగాను 17 మహాయుతికి దక్కితే,  30 స్థానాలను ఎమ్వీఏ  గెలుచుకుంది. పార్లమెంట్ ఓటింగ్ సరళితో అసెంబ్లీ ఓటింగ్ సరళి పొసగని రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి!  అవకాశవాద రాజకీయాలు ముదిరిన రాష్ట్రంలో,  ఫలితాల తర్వాత ఎవరు ఏ కూటమితో ఎంతవరకు కట్టుబడి ఉంటారన్నది గ్యారెంటీ లేని పరిస్థితి!కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో, శివసేనతో పొత్తులో వారు 165 చోట్ల పోటీ చేసి 105 చోట్ల నెగ్గారు. 2014, 2019 రెండు లోక్​సభ ఎన్నికల్లోనూ సొంతంగా 23 సీట్ల చొప్పున బీజేపీ కైవసం చేసుకుంది. 2024లో అది 9కి పడిపోయింది.

మరాఠా వర్సెస్ ఓబీసీ క్లిక్కయ్యేనా?

మారిన పరిస్థితుల్లో మరాఠాలు బీజేపీకి దూరమైనట్టు 2024 లోక్​సభ ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయని సీఎస్డీఎస్- లోక్​నీతి సర్వే గణాంకాలు వెల్లడించాయి. ఎప్పట్లాగే వారు ఎన్నికల అనంతర సర్వే జరిపి, డాటా విశ్లేషించారు. ఈసారి మరాఠా రిజర్వేషన్ ఉద్యమాన్ని దృష్టిలో ఉంచుకొని దాదాపు అన్ని పార్టీలూ మరాఠాలకు ఎక్కువే టిక్కెట్లిచ్చాయి. రాష్ట్రం నుంచి ఎన్నికైన మొత్తం ఎంపీల్లో దాదాపు సగం మంది మరాఠాలే! ఉభయ శివసేనల నుంచి 12 మంది ఎంపికయ్యారు. శివసేనలోనూ పట్టణ ప్రాంతాల్లో ఎక్​నాథ్ షిండే వర్గానికి ఆధిక్యత ఉంటే, థాక్రే వర్గానికి గ్రామీణ ప్రాంతాల్లో పట్టుంది. 

బీజేపీ ప్రధాన ఓటు అగ్రవర్ణాలు, ఓబీసీలు. మరాఠా పీఠం కదులుతున్నందున, హర్యానాలో జాటేతర వర్గాలు, ముఖ్యంగా ఓబీసీలపై దృష్టి కేంద్రీకరించినట్టే ఇక్కడ కూడా మరాఠేతర వర్గాలు, ముఖ్యంగా ఓబీసీలపై ఫోకస్ చేయాలని నాయకత్వం యోచిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. మరాఠాలు 31శాతం ఉంటే ఓబీసీలు 27 శాతమున్నారు. సంపన్నులు, పేదల మధ్య విపరీతమైన ఆర్థిక అంతరాలున్న మహారాష్ట్రలో పేదల మొగ్గు ఎమ్వీయే కూటమివైపు ఉండటం బీజేపీని కలతకు గురిచేసేదే! సంపన్నుల్లో 53 శాతం ఎన్డీయే పక్షాలవైపు మొగ్గితే, పేదల్లో 56 శాతం ఓటర్లు ‘ఇండియా’ కూటమి వైపు మొగ్గినట్టు సర్వే గణాంకాలు చెబుతున్నాయి. అస్పష్టత,- అనిశ్చితితో కప్పల తక్కెడలా మారిన రాజకీయాల్లో,  మహారాష్ట్ర ఓటరు ఎటువైపు మొగ్గాడు అనేది తెలియాలంటే నెల రోజులు నిరీక్షించాల్సిందే!

దారి తప్పుతున్న రాజకీయాలు

దేశ స్వాతంత్ర్యానికి పూర్వం నుంచే క్రియాశీలమైన నేల మహారాష్ట్ర.  జ్యోతీరావ్ పూలే వంటి సమాజ వైతాళికుల నుంచి వినోభాబావే లాంటి సర్వోదయ నాయకుల వరకు, తిలక్,  గోఖలే  తదితర కాంగ్రెస్ నేతల నుంచి అంబేద్కర్ వంటి  సంస్కరణవాదులు ఇక్కడ్నుంచి వచ్చినవారే!  వీరశివాజీని ముందుపెట్టి మరాఠా ఆత్మగౌరవ ఉద్యమాలు సాగాయి. ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్​ (నాగపూర్) ఉన్నదిక్కడే!  మరాఠా రిజర్వేషన్ ఉద్యమం, కోటాల పంచాయితీ స్థానిక రాజకీయాలను బాగా ప్రభావితం చేసిన తాజా పరిణామాలు. నిన్నటి లోక్​సభ ఎన్నికల్లో మరాఠ్వాడా ప్రాంతంలో ‘మహాయుతి’ కూటమి ఎక్కువ నష్టపోయింది. ఎనిమిదింట ఒక స్థానమే కూటమి గెలిచింది. 2014 నుంచి మహారాష్ట్ర  గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ ఆధిక్యత సాధిస్తుండగా ఈసారి గ్రామీణ ఓటర్లు ప్రాంతాలకు అతీతంగా కాంగ్రెస్, ఎమ్వీఏ కూటమి వైపు మొగ్గారు.  మరాఠ్వాడా,  విదర్భ,  పశ్చిమ మహారాష్ట్రలో బీజేపీ కొంత దెబ్బతింది. ఇక బీజేపీ భారీగా నష్టపోనిది ముంబాయి, కొంకన్, థానే ప్రాంతాల్లో.  అక్కడ కూడా శివసేన పెరిగి బీజేపీ కొంత తగ్గింది. 2019లో ఒక్క ముస్లింలు తప్ప దాదాపు అన్ని వర్గాల మద్దతు పొందిఆధిక్యత సాధించిన బీజేపీ ఇప్పుడా స్థితిలో లేదు.

- దిలీప్ రెడ్డి, పొలిటికల్ ఎనలిస్ట్, డైరెక్టర్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ-