ముంబై, న్యూఢిల్లీ: మహారాష్ట్రలో మళ్లీ కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో ప్రభుత్వం ఆంక్షలను కఠినం చేసింది. రాష్ట్రంలో శనివారం వరుసగా రెండో రోజు కొత్త కేసులు 40 వేలు దాటాయి. శుక్రవారం స్టేట్లో 40 వేలకుపైగా కేసులు నమోదు కాగా, శనివారం 41,434 మందికి వైరస్ సోకింది. ఒక్క ముంబైలోనే 20 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. స్టేట్లో మొత్తం ఒమిక్రాన్ బాధితులు వెయ్యి దాటారు. దీంతో ప్రభుత్వం శనివారం మరిన్ని ఆంక్షలను ప్రకటించింది. జనవరి 10 నుంచి నైట్ కర్ఫ్యూ విధించింది. రాత్రి 11 నుంచి ఉదయం 5 మధ్య కర్ఫ్యూ అమల్లో ఉంటుందని, ఎక్కడా ఐదుగురికి మించి గుమిగూడొద్దని ఉత్తర్వులు జారీ చేసింది. స్కూళ్లు, కాలేజీల మూసివేతను ఫిబ్రవరి 15 వరకూ పొడిగించింది. బ్యూటీ సెలూన్లు, స్పోర్ట్స్ కాంప్లెక్సులు, స్విమ్మింగ్ పూల్స్, జిమ్, స్పాలు, వెల్ నెస్ సెంటర్లను బంద్ పెట్టాలని స్పష్టంచేసింది. టీకాలు వేసుకున్న ప్యాసింజర్లను మాత్రమే బస్సులు, ట్రెయిన్లలో ప్రయాణించేందుకు అనుమతించాలని పేర్కొంది. హాల్స్, మాల్స్, మార్కెట్లు, సెలూన్లు 50% కెపాసిటీతోనే నడవాలని, రాత్రి 10 నుంచి ఉదయం 8 మధ్య బంద్ పెట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూ షురూ
ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూ మొదలైంది. శుక్రవారం రాత్రి 10 గంటలకు మొదలైన కర్ఫ్యూ.. సోమవారం తెల్లవారుజామున 5 వరకు అమల్లో ఉండనుంది. కర్ఫ్యూ టైమ్లో ఎవరైనా అనవసరంగా రోడ్ల పైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. సిటీలో ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతున్నారు. ఎమర్జెన్సీ ఉన్నోళ్లను, పాస్ ఉన్నోళ్లను మాత్రమే వదిలేస్తున్నారు. ఎయిర్ పోర్టులు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లకు వచ్చేటోళ్లు, పోయేటోళ్లను టికెట్లు చూపిస్తేనే పంపిస్తున్నారు. ఎవరైనా బయటకు వెళ్లేదుంటే, తప్పనిసరిగా పాస్ తీసుకోవాలని సూచిస్తున్నారు.
