ముంబై/న్యూఢిల్లీ: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా కేసులు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. కేసులు ఇలాగే పెరుగుతూ పోతే సిటీలో మళ్లీ లాక్ డౌన్ వంటి రూల్స్ అమలు చేయాల్సి రావచ్చని బుధవారం మహారాష్ట్ర హెల్త్ మినిస్టర్ రాజేశ్ తోపె చెప్పారు. ‘‘రాష్ట్రంలో యాక్టివ్ కేసులు క్రమంగా పెరుగుతుండటం ఆందోళనకరం. ముంబైలో పాజిటివిటీ రేటు 4 శాతానికి పెరిగింది. ఒకవేళ ఇది 5 శాతానికి చేరితే.. కఠిన ఆంక్షలు విధించే అంశాన్ని పరిశీలిస్తాం” అని ఆయన వెల్లడించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 252 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని, 90% మంది పేషెంట్లు డిశ్చార్జ్ అయ్యారని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఉన్న పేషెంట్లలో ఎవరూ సీరియస్ కండిషన్లో లేరన్నారు. అయితే, ట్రెయిన్లు, బస్సుల్లో రద్దీని తగ్గించేందుకు, పెండ్లిళ్లు, ఫంక్షన్లలో జనం గుమిగూడకుండా చూసేందుకు చర్యలు చేపట్టే విషయాన్ని ఆలోచిస్తామన్నారు. పరిస్థితి ఆందోళనకరంగా మారుతోందని, అధికారులంతా అలర్ట్‌గా ఉండాలని, ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలని ఆయన కోరారు. గత 8, 10 రోజుల్లో రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 5, 6 వేల మధ్యలో ఉండగా, మంగళవారం 11 వేలు దాటాయని, గురువారం 20 వేలు దాటొచ్చని ఆయన చెప్పారు. రాష్ట్రంలో కరోనా సిచువేషన్పై సీఎం ఉద్ధవ్ థాక్రే త్వరలోనే కొవిడ్ టాస్క్ ఫోర్స్‌తో మీటింగ్ నిర్వహిస్తారని తెలిపారు. కాగా, ముంబైలో బుధవారం ఒక్కరోజే 2,510 కేసులు నమోదయ్యాయి. మంగళవారం రాష్ట్రంలో 2,171 కేసులు నమోదు కాగా, ముంబైలోనే 1,333 మందికి పాజిటివ్ వచ్చింది.
ఢిల్లీ మెట్రో స్టేషన్ల వద్ద ఫుల్ రష్
కరోనా వ్యాప్తి కారణంగా ఢిల్లీలో ఆంక్షలు పెట్టడంతో మెట్రో స్టేషన్లు, బస్ స్టాపుల వద్ద కిలోమీటర్ల కొద్దీ క్యూలు కనిపిస్తున్నాయి. బస్సులు, ట్రెయిన్ లలో 50% సీటింగ్ కెపాసిటీతోనే నడపాలని ప్రభుత్వం నిర్ణయించడంతో బుధవారం సిటీలోని అనేక చోట్ల ప్యాసింజర్లు బారులు తీరారు. రష్చాలా ఎక్కువ కావడంతో ప్యాసింజర్లు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం సిటీలో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. స్కూల్స్, కాలేజీలు, టాకీసులు బంద్ చేయాలని, బస్సులు, ట్రెయిన్లను 50% సీటింగ్ కెపాసిటీతోనే నడపాలని ఆదేశించారు. దీంతో బస్సులు, ట్రెయిన్లలో వెళ్లేందుకు తాము 2 గంటల పాటు క్యూలలో వెయిట్ చేయాల్సి వచ్చిందని ప్యాసింజర్లు తెలిపారు.
ప్యాసింజర్ల ఇబ్బందులను పట్టించుకోవాలని కొందరు కోరగా.. సిటీలో కరోనా పెరుగుతుండటంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేనని మరికొందరు ప్యాసింజర్లు సమర్థించారు. కాగా, ఢిల్లీలో మంగళవారం 496 కేసులు నమోదు కాగా, ఇప్పటివరకూ 238 ఒమిక్రాన్ కేసులు రికార్డ్ అయ్యాయి.
