ఈ జీవితానికి ఇది చాలు.. మళ్లొస్తా: ఆత్మహత్య చేసుకున్న డీసీపీ కుమారుడు

మహారాష్ట్ర డీసీపీ షిల్వంత్ నాందేడ్కర్ ఏకైక కుమారుడు సాహిల్ శిల్వంత్(17) ఆత్మహత్య చేసుకున్నాడు. ఛత్రపతి సంభాజీనగర్‌లోని తమ ఇంట్లోనే పడకగదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం సాయంత్రం వరకూ స్నేహితులు, కుటుంబసభ్యులతో కలిసి సరదాగా గడిపిన సాహిల్ హఠాత్తుగా ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలవరపెడుతోంది. ఈ విషాద ఘటన వెనుక గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

మళ్లొస్తా..

అతని గదిలో ఎటువంటి సూసైడ్ నోట్ లభించినప్పటికీ, అద్దంపై మళ్లీ జన్మిస్తా అని రాసుండటం పలు అనుమానాలకు దారితీస్తోంది. "ఈ జీవితాన్ని, శరీరాన్ని ఆస్వాదించాను.. ఇక చాలు. నేను  మళ్ళీ వస్తా.. వదిలి వెళ్లిపోవడం లేదు.." అని సాహిల్ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు  గదిలోని అద్దంపై రాశాడు. దీనిని బట్టి చనిపోతే.. మళ్లీ జన్మించొచ్చు అన్న నమ్మకంతోనే ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చన్న మాటలు వినపడుతున్నాయి. ఈ ఘటనపై వేదాంత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. 

చదువులో ఫస్ట్..

 సాహిల్ చదువులోనూ ముందుండేవాడని వారి కుటుంబసభ్యులు, స్నేహితులు చెప్తున్నారు. ఆదివారం రాత్రి తల్లిదండ్రులతో కలిసి డిన్నర్ చేసిన అతను చదువుకోవడానికి బెడ్ రూంలోకి వెళ్తున్నానని చెప్పి లోపలకి వెళ్ళాడు. సోమవారం ఉదయం తల్లిదండ్రులు అతన్ని నిద్ర లేపే ప్రయత్నం చేయగా.. గది తలుపులు తీయలేదు. మరో తాళం సాయంతో గది  తలుపుల తీయగా సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని కనిపించాడు.