ఏండ్ల కల నెరవేరింది : యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: ఎన్నో ఏండ్ల కల నెరవేరిందని మహబూబ్ నగర్  ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పీయూలో ఇంజనీరింగ్, లా కాలేజీలకు ప్రభుత్వం నుంచి అనుమతి  లభించడంతో బుధవారం ఏర్పాటు చేసిన అభినందన సభకుఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న వేళ నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్న యూనివర్సిటీకి అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రూ.18 కోట్లు రిలీజ్​ చేశారని గుర్తు చేశారు. పాలమూరు యూనివర్సిటీ ఏ ఒక్కరి కృషి ఫలితమో కాదని, సమిష్టి కృషితో సాధ్యమైందని చెప్పారు. 

పాలమూరు యూనివర్సిటీ అభివృద్ధి వెనుక అందరి సహకారం ఉందన్నారు. కేంద్రం అందిస్తున్న సహకారం, సీఎం ఆశీస్సులతో పీయూ ఈ స్థాయికి చేరుకుందని చెప్పారు. ఇంజనీరింగ్, లా కాలేజీల ఏర్పాటుకు అనుమతి ఇచ్చిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి క్లాసులు ప్రారంభిస్తామని తెలిపారు. ప్రముఖ కంపెనీలతో ఒప్పందం చేసుకొని విద్యార్థులు మంచి భవిష్యత్తు పొందాలని సూచించారు. 

మున్సిపల్  చైర్మన్  ఆనంద్ గౌడ్, లైబ్రరీ చైర్మన్  మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్  లక్ష్మణ్  యాదవ్, మార్కెట్  కమిటీ చైర్మన్  బెక్కెరి అనిత, మధుసూదన్ రెడ్డి, వైస్  చైర్మన్  పెద్ద విజయ్  కుమార్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, వీసీ జీఎన్  శ్రీనివాస్, కాంగ్రెస్  నేతలు వినోద్ కుమార్, ఎన్పీ వెంకటేశ్, సత్తూరు చంద్రకుమార్ గౌడ్, మారే పల్లి సురేందర్ రెడ్డి, రిజిస్ట్రార్ మధుసూదన్ రెడ్డి, ప్రిన్సిపాల్ చంద్రకిరణ్  పాల్గొన్నారు.