అటవీ అమరవీరుల త్యాగాలు మరువలేనివి :ఎమ్మెల్యే వంశీకృష్ణ

అచ్చంపేట, వెలుగు: అటవీ సంపదను కాపాడేందుకు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి అమరులైన అటవీ సిబ్బంది త్యాగాలను వృథా కానీయమని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, డీఎఫ్ వో రోహిత్ రెడ్డి పేర్కొన్నారు.  బుధవారం జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా డీఎఫ్ వో ఆధ్వర్యంలో పట్టణంలో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది బైక్  ర్యాలీ నిర్వహించారు.

అమరవీరుల స్థూపం వద్ద అటవీశాఖ అధికారులు సిబ్బంది రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంతో పోల్చుకుంటే నల్లమల అడవులు మరింత అభివృద్ధి చెందాయని, జంతువుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోందన్నారు. రాష్ట్రానికి నల్లమల అటవీ ప్రాంతం ఊటీ వంటిదని, మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుందన్నారు. అచ్చంపేట, అమ్రాబాద్  డివిజన్  పరిధిలోని అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

పాలమూరు: అటవీ అమరవీరుల త్యాగం వెల కట్టలేనిదని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. జిల్లా కేంద్రంలోని ఫారెస్ట్  కాంప్లెక్స్ లో అటవీ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అడవుల రక్షణ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సూచించారు.

అనంతరం ఫారెస్ట్  ఆఫీస్​ ఆవరణలో కలెక్టర్  విజయేందిర బోయితో కలిసి  మొక్కలు నాటారు. రెడ్ క్రాస్  సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అడిషనల్  ఎస్పీ రాములు, డీఎఫ్ వో సత్యనారాయణ, మున్సిపల్  కమిషనర్ మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.