డీకే అరుణ ఆరోపణలు అర్థరహితం : వంశీచంద్ రెడ్డి

మిడ్జిల్, వెలుగు: బీజేపీ క్యాండిడేట్​ డీకే అరుణ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ తనపై, కాంగ్రెస్​ పార్టీపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని మహబూబ్ నగర్  కాంగ్రెస్  ఎంపీ క్యాండిడేట్  వంశీచంద్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో మిడ్జిల్, ఊర్కొండ మండలాల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. 

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్​రెడ్డి, యూత్​ కాంగ్రెస్  రాష్ట్ర అధ్యక్షుడు శివసేనా రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంశీచంద్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డితో మిడ్జిల్  మండలానికి ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. కార్యకర్తలతోనే తనకు టికెట్​ వచ్చిందని, గెలిపించే బాధ్యత కూడా తీసుకోవాలని కోరారు. మిడ్జిల్  మండలంలో మెజార్టీ వస్తుందనే నమ్మకం సీఎంకు ఉందన్నారు. కొన్ని పార్టీల నాయకులు అబద్ధాలు, బూటకపు మాటలు చెప్పి ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వంశీచంద్ రెడ్డి మా వల్లనే గెలిచిండని చెప్పుకునే స్థాయిలో మీరు కష్టపడాలని సూచించారు. 

గత ప్రభుత్వంలో కట్టిన గొర్రెల డీడీలు తిరిగి వస్తాయని తెలిపారు. ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని, సమస్యలపై ప్రెస్  అకాడమీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డికి రిపోర్ట్  ఇవ్వాలని సీఎం సూచించారని తెలిపారు. అనంతరం పలు పార్టీల నాయకులు కాంగ్రెస్  పార్టీలో చేరారు. ఎమ్మెల్యే అనిరుధ్​రెడ్డి, యూత్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు శివసేనారెడ్డి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే పదేండ్లలో రూ.100 కోట్ల అభివృద్ధి పనులు చేస్తే, తాను మూడు నెలల్లోనే రూ.160 కోట్ల అభివృద్ధి పనులను తీసుకొచ్చానని తెలిపారు. కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ఆరె కటికల మద్దతు కాంగ్రెస్  పార్టీకే ఉంటుందని రాష్ట్ర అధ్యక్షుడు అశోక్, నందీశ్వర్, నరేందర్, రాజారాం తెలిపారు. టీపీసీసీ సెక్రటరీ రబ్బానీ, ఎంపీటీసీలు గౌస్, నర్సింహ, అల్వాల్ రెడ్డి, వెంకటయ్య గౌడ్, తిరుపతి రెడ్డి, సునీత పాల్గొన్నారు.