పాలమూరుకు స్పెషల్​ స్టేటస్​ తేలేదంటున్నరు, నేనేమన్నా కేంద్ర మంత్రినా: డీకే అరుణ

కొడంగల్, వెలుగు: ‘అరుణమ్మ పాలమూరుకు ఏం చేసింది? పాలమూరు– రంగారెడ్డికి స్పెషల్​స్టేటస్​ఎందుకు తేలేదని నన్ను విమర్శిస్తున్నరు. నేను కేంద్ర మంత్రిని కాదు. నాకు స్టేటస్​అంతకన్నా లేదు’ అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్​నగర్​బీజేపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. శుక్రవారం కొడంగల్​లో ఆమె మాట్లాడుతూ పాలమూరు జిల్లా అభివృద్దికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. 

గతంలో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ప్రధాని మోదీ 60శాతం నిధులు ఇస్తానని మాటిచ్చారే తప్ప ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించలేదన్నారు. భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టుల కోసం పాలమూరు నుంచి హైదరాబాద్​వరకు పాదయాత్ర చేసిన తొలి మహిళగా ఆనాడు తనకు గుర్తింపు దక్కిందన్నారు. వికారాబాద్–కృష్ణ రైల్వే లైన్​ కోసం కేంద్రం రూ.2196 కోట్లు మంజూరు చేసిందన్నారు. సర్వే పూర్తి కావడంతో పాటు డీపీఆర్​లు సిద్ధంగా ఉన్నాయన్నారు. పాలమూరు జిల్లా అభివృద్ధి అవ్వాలన్నా, పాలమూరు ప్రాజెక్టులకు నిధులు కావాలన్నా తనను గెలిపించాలని కోరారు.  

నేనే జీవోలు విడుదల చేయించినా...

నిధుల దోపిడీ కోసమే కేసీఆర్ పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్​డిజైన్​మార్చాడని అరుణ ఆరోపించారు. మొట్టమెదట తానే పాలమూరు ప్రాజెక్ట్​కోసం 69, 72 జీవోలు విడుదల చేయించానన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్​రీ డిజైన్​ పేరుతో ఇక్కడి ప్రజలను మోసం చేసిండన్నారు. క్రమశిక్షణ కమిటీ మెంబర్​నాగురావు నామాజీ, రాష్ర్ట కార్యవర్గ సభ్యులు పున్నంచంద్​ లాహోటి, కొడంగల్​ఇన్​చార్జి రాజవర్ధన్​రెడ్డి  పాల్గొన్నారు.