Mahashivratri 2024 : మహా శివరాత్రి రోజు ఏం చేయాలి.. ఎలా చేయాలి.. !

శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు మహా శివరాత్రి. హిందువులు పెద్ద పండుగల్లో శివరాత్రి ఒకటి. పార్వతీదేవిని శివుడు పెళ్లాడిన రోజునే ఈ పండుగగా జరుపుకుంటారు. అలాగే శివపురాణంలో మహాశివరాత్రికి సంబంధించి ఇంకొన్ని కథలు కూడా ఉన్నాయి. మాఘమాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి రోజున మహా శివరాత్రి వస్తుంది. ఈ రోజున శివుడిని భక్తి, పూజలతో కొలిస్తే అంతా మంచి జరుగుతుందని నమ్ముతారు.

దేశమంతటా శివాలయాల్లో పెద్ద ఎత్తున శివరాత్రి సంబరాలు జరుగుతుంటాయి. శివరాత్రి అనగానే అందరికీ వెంటనే గుర్తొచ్చేది. ఉపవాసం, జాగరణ. ఈ రోజున ఉపవాసం ఉండి, రాత్రి జాగరణ చేస్తే పుణ్యం దక్కుతుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు.

శివరాత్రి వ్రతం.. ఎలా చేయాలి?

శివరాత్రి నాడు తెల్లవారుజామునే లేచి, స్నానం చేసి ఆ తర్వాత శివరాత్రి వ్రతాన్ని మొదలుపెట్టాలి. ఈ వ్రతం చేసేటప్పుడు ఉపవాసం, జాగరణం, బ్రహ్మచర్యం అనే నియమాలు పాటించాలి. ఇంట్లోనే గానీ, ఆలయంలోగానీ వ్రతాన్ని ఆచరించవచ్చు. రాత్రంతా జాగరణం ఉండి, ఉదయాన్నే స్నానం చేశాక మళ్లీ పూజ చేసి వ్రతాన్ని విడవాలి.

ఇలా చేయండి

• ఉదయాన్నే స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకోవాలి.
* గుడికి వెళ్లి దేవుడ్ని దర్శనం చేసుకోవాలి. 
* అన్నం లాంటి రోజూ తీసుకునే ప్రధాన ఆహారం కాకుండా పాలు, పండ్లు మాత్రమే, అదీ సాయంత్రం పూటనే తీసుకోవాలి. 
* ఇతరులతో దైవ సంబంధమైన మాటలనే ఎక్కువగా మాట్లాడితే మంచిది.
* ఓం నమః శివాయ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి.
• అనారోగ్యంతో ఉన్నప్పుడు ఉపవాసం ఉండకండి.