శ్రీశైలంలో ఘనంగా మహాశివరాత్రి... లక్షల మందితో కిటకిట

ఇరు తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏ గుడి చూసినా కిక్కిరిసిన భక్తజనంతో కలకలలాడుతూ, శివ నామస్మరణతో హోరెత్తుతున్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. లక్షల మంది భక్త జనం పోటెత్తటంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది. భక్తుల రద్దీ కారణంగా దర్శనానికి ఎక్కువ సమయం పడుతున్నప్పటికీ భక్తులు శ్రద్ధతో క్యూ లైన్లలో వేచి ఉన్నారు.

శివరాత్రి పర్వదినాన భక్తులు ఉపవాసం ఉండి రాత్రి స్వామివారి జపం చేస్తూ జాగరణ చేయటం సంప్రదాయంగా వస్తోంది. భక్తుల రద్దీని ముందే ఉహించిన అధికారులు ఎక్కడిక్కడ పకడ్బందీ ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో ఆహ్లాదకర వాతావరణంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ పరిసరాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసి మంచి నీరు, మజ్జిగ పంపిణీ చేస్తున్నారు అధికారులు.