Nayanthara Dhanush: జనవరి 8 లోగా సమాధానం ఇవ్వండి.. నయనతార, నెట్ఫ్లిక్స్కు కోర్టు నోటీసులు

‘నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్' వివాదంలో భాగంగా నటుడు ధనుష్.. మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. నయనతార, విఘ్నేశ్ శివస్ దంపతులపై ఆయన పిటిషన్ వేశారు.

తాజాగా Dec 12న న్యాయస్థానం ఈ కేసును విచారించింది. 2025 జనవరి 8వ తేదీ లోపు ఈ వ్యవహారంపై సమాధానం ఇవ్వాలని నయన్ దంపతులను, నెట్ ఫ్లిక్స్ బృందాన్ని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు వారికి నోటీసులు జారీ చేసింది.

నయనతార జీవితాన్ని ఆధారంగా చేసుకొని రూపుదిద్దుకున్న డాక్యుమెంటరీ ఫిల్మ్ 'నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్. తన పర్మిషన్ తీసుకోకుండా ఇందులో 'నానుమ్ రౌడీ దాన్' బిహైండ్ ది స్క్రీన్ ఫుటేజ్ను ఉపయోగించారని ఆరోపిస్తూ చిత్ర నిర్మాత, నటుడు ధనుష్ లీగల్ నోటీసులు పంపించారు. మూడు సెకన్ల క్లిప్నకు రూ.10 కోట్లు డిమాండ్ చేశారు.

ఈ క్రమంలోనే నయనతార ధనుష్ క్యారెక్టర్ ను తప్పుబట్టారు. లీగల్ నోటీసులు పంపించినప్పటికీ డాక్యుమెంటరీలో ఆ సన్నివేశాలు ఉపయోగించడంపై ధనుష్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. మరి ఈ వివాదం ఎంతవరకు వెళుతుందో చూడాలి.

నయన్ ధనుష్ వివాదం:

2022లో నయనతార - విఘ్నేష్ శివన్ చెన్నై మహాబలిపురంలోని స్టార్ హోటల్‌లో మ్యారేజ్ చేసుకున్నారు. అయితే వీరి వివాహ వీడియో  ప్రసార హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ కు భారీ ధరకు ఇచ్చారు. వీరి మ్యారేజ్కి అయిన మొత్తం ఖర్చు రూ.10 కోట్ల కంటే తక్కువే అయినప్పటికీ.. నెట్‌ఫ్లిక్స్‌కు వివాహ వీడియో ప్రసార హక్కులను రూ.25 కోట్లకు ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలో వీరి పెళ్లి వీడియోలో 'బియాండ్ ది ఫెయిరీటేల్‌లో' 'నానుమ్‌ రౌడీ దాన్‌' పాటలు వినియోగించుకోవడానికి నిర్మాత ధనుష్ పర్మిషన్ ఇవ్వలేదు. అయినా, తగిన అనుమతి లేకుండా 3 సెకన్ల వీడియో వాడారని ధనుష్.. రూ.10 కోట్లు పరిహారం చెల్లించాలంటూ నయనతారకి నోటీసులు పంపాడు. దాంతో నయన్ తనదైన శైలిలో మూడు పేజీల ఓపెన్ లెటర్ రాసి ధనుష్పై విరుచుకుపడింది. ప్రస్తుతం వీరి వివాదం కొనసాగుతోంది.