- న్యూ అర్బన్ ఇండియా కాంక్లేవ్‌లో మోడీ
- సిటీల్లో 50 లక్షల ఇండ్లు కట్టించి, పేదలకిచ్చినం
- యూపీలో లబ్ధిదారులకు 75 వేల ఇండ్ల పంపిణీ
- గత ఎస్పీ సర్కారు పేదలకు ఇండ్లు కట్టివ్వలేదన్న ప్రధాని
లక్నో: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) కింద ఇండ్లు కట్టించి ఇవ్వడం ద్వారా 3 కోట్ల కుటుంబాలను లక్షాధికారులను చేశామని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ‘‘పీఎంఏవై కింద సిటీల్లో 1.13 కోట్లకు పైగా ఇండ్లను కట్టించేందుకు అనుమతులిచ్చాం. అందులో 50 లక్షలకు పైగా ఇండ్లను కట్టించి, పేదలకు అందజేశాం. 2014 ముందు దాకా దేశంలో 13 లక్షల ఇండ్ల నిర్మాణానికి మాత్రమే అనుమతులిచ్చారు” అని తెలిపారు. యూపీలో గతంలో అధికారంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ.. పేదలకు ఇండ్లు కట్టివ్వలేదని పీఎం మోడీ మండిపడ్డారు. కేంద్ర హౌసింగ్ స్కీమ్ అమలు విషయంలో అడ్డంకులు సృష్టించిందని విమర్శించారు. మంగళవారం ‘ఆజాదీ @ 75 న్యూ అర్బన్ ఇండియా: ట్రాన్స్‌ఫార్మింగ్ ది అర్బన్ ల్యాండ్‌స్కేప్’ కాన్ఫరెన్స్‌ను ప్రధాని ప్రారంభించారు. పీఎంఏవైయూ కింద యూపీలోని 75 జిల్లాల్లో నిర్మించిన 75 వేల ఇండ్లను లబ్ధిదారులకు డిజిటల్‌గా అందజేసి, వారితో వర్చువల్‌గా ముచ్చటించారు. పలు డెవలప్‌మెంట్ ప్రాజెక్టులను కూడా మోడీ ప్రారంభించారు.
అడ్డంకులు సృష్టించారు..
‘‘పీఎంఏవై కింద యూపీలో 18 వేల ఇండ్లను కట్టించేందుకు 2017 ముందు అనుమతులు ఇచ్చాం. కానీ గత ప్రభుత్వ హయాంలో కనీసం 18 ఇండ్లు కూడా కట్టివ్వలేదు. కావాల్సినన్ని డబ్బులు ఉన్నాయి. కేటాయింపులు జరిగాయి. కానీ అప్పట్లో అధికారంలో ఉన్న వాళ్లు అడ్డంకులు సృష్టించారు. ఎందుకంటే ఇండ్లు కట్టించడం వాళ్లకు ఇష్టం లేదు” అని మోడీ ఫైర్ అయ్యారు. ‘‘ఇదే సమయంలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం.. 9 లక్షల ఇండ్లు కట్టించింది. మరో 14 లక్షల ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయి” అని వివరించారు. అర్బన్ మిడిల్ క్లాస్ ప్రజలకు ఎదురవుతున్న సవాళ్లు, సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, ఈ క్రమంలో రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) ఏర్పాటు పెద్ద ముందడుగని చెప్పారు. మేజర్ సిటీల్లో మెట్రో సర్వీసుల పరిధి పెరుగుతోందని మోడీ చెప్పారు.
దీపాలు వెలగించండి
9 లక్షల మంది పీఎంఏవై లబ్ధిదారులు దివాళీ సందర్భంగా రెండు దీపాల చొప్పున వెలిగించాలని మోడీ పిలుపునిచ్చారు. అయోధ్యలో 7.5 లక్షల దీపాలను వెలిగాస్తారని చెప్పారు. యూపీలో యోగి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి అయోధ్యలో దీపోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు..
25 లక్షల మంది వీధి వ్యాపారులకు సాయం
‘‘ఎల్‌ఈడీ స్ట్రీట్ లైట్ల ఏర్పాటు వల్ల కరెంటు బిల్లు భారీగా తగ్గుతోంది. అర్బన్ సంస్థలకు ఏటా రూ.వెయ్యి కోట్లు ఆదా అవుతోంది. ఈ మొత్తాన్ని ఇతర అభివృద్ధి పనులకు ఉపయోగిస్తున్నారు” అని మోడీ చెప్పారు. టెక్నాలజీ వల్ల గత ఆరేడేళ్లలో అర్బన్ సెక్టార్‌లో చాలా మార్పు వచ్చిందన్నారు. ‘‘పీఎం స్వనిధి యోజన కింద వీధి వ్యాపారులను బ్యాంకులతో లింక్ చేశాం. రూ.2500 కోట్లకు పైగా సాయాన్ని 25 లక్షల మందికి అందజేశాం. ఒక్క యూపీలోనే 7 లక్షల మంది లబ్ధి పొందారు” అని ప్రధాని నరేంద్ర మోడీ వివరించారు.
