Lucky Baskhar Review: 'లక్కీ భాస్కర్' మూవీ రివ్యూ.. దుల్కర్‌ సల్మాన్‌ ఖాతాలో మరో హిట్ పడిందా?

సార్ సినిమాతో ధనుష్ (Danush)కు సూపర్ హిట్ అందించిన దర్శకుడు వెంకీ అంట్లూరి(Venky Atluri) డైరెక్షన్లో వచ్చిన లేటెస్ట్ మూవీ లక్కీ భాస్కర్ (Lucky Baskhar).

సీతా రామం (Sitha Ramam) సక్సెస్ తరువాత పాన్ ఇండియా లెవల్లో హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) నుంచి వచ్చిన డైరెక్ట్ తెలుగు మూవీ కావడంతో భారీ అంచనాలున్నాయి. మీనాక్షి చౌదరి కథానాయిక. సితార ఎంటర్‌‌టైన్‌‌మెంట్స్‌‌, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌‌ సంస్థలు ఈ సినిమాను నిర్మించాయి. 

ఈ నేపథ్యంలో లక్కీ భాస్కర్ మూవీ ఇవాళ గురువారం అక్టోబర్ 31న థియేటర్లలో రిలీజైంది. పీరియడ్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ సినిమా దుల్కర్కి ఎలాంటి హిట్ అందించింది. విడుదలకు ముందే లక్కీ భాస్కర్‌పై అంచనాలు పెంచేలా చేసిన మేకర్స్.. ఎలాంటి విజయం దక్కించుకున్నారో.. రివ్యూలో చూసేద్దాం. 

కథేంటంటే::

ఈ మూవీ కథ 1989-92 బ్యాక్డ్రాప్లో జరుగుతూ ఉంటుంది. భాస్కర్ కుమార్ (దుల్కర్ సల్మాన్) ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఓ సాధారణ బ్యాంక్ ఉద్యోగి. క్యాషియర్‌గా పనిచేస్తూ ఉంటాడు. తనకు వచ్చే జీతంతో కుటుంబం మొత్తాన్ని నడిపించడానికి అనేక కష్టాలు పడుతూ ఉంటాడు. తన భార్య సుమతి(మీనాక్షి చౌదరి), కొడుకు కార్తీక్(రిత్విక్)లనే కాకుండా అతని తండ్రి ప్రహ్లాద్ (సర్వదమన్ బెనర్జీ)కి అనారోగ్యం.

అంతేకాకుండా పెళ్లీడుకొచ్చిన ఒక చెల్లి, కాలేజీలో చదువుకునే తమ్ముడు.. ఇలా తన కుటుంబ  బాధ్యతలన్ని తన మీదనే ఉంటాయి. ఈ క్రమంలో కనీసం తన భార్యను హ్యాపీగా చూసుకోవాలన్న ఆశను కూడా నెరవేర్చలేని ఆర్ధికభారంతో అప్పులు చేస్తూ జీవనం సాగిస్తుంటాడు.సుమతిని ప్రేమించి పెళ్లి చేసుకొన్నందుకు అత్తింటివారి అవమానాలతో భాస్కర్ కాలం గడుస్తుంటుంది. ఉత్తమ ఉద్యోగి అనే పేరొస్తుంది తప్ప ప్రమోషన్ మాత్రం రాదు. దాంతో కష్టపడి పనిచేసినా ప్రమోషన్ కూడా పొందలేకపోతున్నాని ఆలోచించే క్రమంలోనే..ఒక సంఘటన చూసి ఒక రోజు అనూహ్య నిర్ణయం తీసుకుంటాడు.

అదే టైంలో బ్యాంకులో అప్పు తీసుకోవడానికి వచ్చిన ఆంటోనీ(రాంకీ)తో చేతులు కలిపి..పెద్ద రిస్క్ చేస్తాడు. దాంతో ఏకంగా బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ అవుతాడు. కోట్లకు కోట్లు సంపాదిస్తాడు. మరి భాస్కర్ చేసిన ఆ రిస్క్ ఏమిటి? ఇందులో బ్యాంక్ ఛైర్మన్ (టిను ఆనంద్), మేనేజర్(సచిన్ ఖేడ్కర్) పాత్రలు ఏమిటి? డబ్బు ఆశ అతన్ని ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టేసింది. సీబీఐ ఆఫీసర్ (సాయికుమార్) భాస్కర్పై ఎలాంటి చర్యలు తీసుకున్నాడు? చివరకి భాస్కర్ లక్కీ భాస్కర్ అయ్యాడా? లంచగొండి అయ్యాడా? అనే తదితర విషయాలు తెలియాలంటే సినిమాను థియేటర్లో చూడాల్సిందే.

ఎలా ఉందంటే::

ఒక సాధారణ మనిషి డబ్బు సంపాదించాలనుకున్నప్పుడు ఎంత దూరమైనా వెళ్తాడు అనే సరికొత్త కాన్సెప్ట్ తో రూపొందింది. బ్యాంకింగ్ నేపథ్యంలో థ్రిల్లర్ జానర్‌లో సాగే కథను తనదైన శైలిలో రాసుకుని, తెరకెక్కంచడంలో సక్సెస్ అయ్యాడు డైరెక్టర్ వెంకీ అట్లూరి. ఇలాంటి నేపథ్యంలో ఇంతవరకు ఎలాంటి సినిమా రాలేదని చెప్పుకోవాలి.

అయితే ,హిందీలో మాత్రం హిందీలో “స్కాం 1992” అనే హర్షద్ మెహతా కథ ఓటీటీలో సిరీస్గా తెరకెక్కిందే తప్ప ఇలా సినిమాగా రాలేదు. ఇకపోతే మన తెలుగు ఇండస్ట్రీలో డబ్బు కోసం అష్ట కష్టాలు పడి, తర్వాత డబ్బు సంపాదించే మార్గం తెలిసి ఒక స్థాయికి ఎదగడం లాంటి కథలతో సినిమాలు వచ్చాయి. కానీ 90'స్ జరిగిన ఆర్ధికమోసాల నేపథ్యంలో రావడం విశేషం అని చెప్పుకోవాలి.

సీబీఐ ఆఫీసర్స్ భాస్కర్ని అదుపులోకి తీసుకుని, బ్యాంక్ కి తీసుకుని వెళ్లి, విచారణ ప్రారంభించడంతో మూవీ మొదలౌతుంది. కట్ చేస్తే కథ మూడేళ్ల వెనక్కి వెళ్తుంది. ఇక ఆ తర్వాత వచ్చే ఫ్యామిలీ డ్రామా, తన పాత్ర ఇలాంటివి ఆసక్తికరంగా ఉంటాయి. ఆ తర్వాత కథ ముందుకెళ్లే కొద్దీ భాస్కర్ లైఫ్ లో అవసరం, అవమానం, అపధర్మం, ఆశ, అత్యాశ, ఆపద..ఇలా ప్రతీఒక్కటి ఎదురువుతాయి.

ALSO READ : KA Review: 'క' మూవీ రివ్యూ.. మిస్టరీ థ్రిల్లర్గా ట్విస్టులు.. కిరణ్ అబ్బవరం కష్టం ఫలించిందా?

ప్రస్తుతం ఈ టెక్నాలజీ కాలంలో స్టాక్ ఎక్సేంజ్, బ్యాంక్ ల్లోజరిగే స్కామ్ లు జరుగుతుంటాయి. కానీ అవేమాత్రం సామాన్య మనుషులకి అర్ధమయ్యేలా ఉండవు. ఇదే విషయాన్ని..అంటే ఫైనాన్షియల్ స్కామ్స్ జరిగే తీరును..అందరికీ అర్థమయ్యేలా.. ఆసక్తి రేకెత్తించేలా ఉత్కంఠ రేకెత్తించే థ్రిల్స్ తో వెంకీ అట్లూరి చూపించిన విధానం బాగుంది. ఇక డైరెక్టర్ వెంకీ రాసుకున్న బలమైన స్క్రిప్టుకు హీరో దుల్కర్ సల్మాన్ తన ఫెర్ఫార్మెన్స్‌తో మరో రేంజ్‌కు తీసుకెళ్లాడు. ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న ఓ చిన్న బ్యాంక్ ఉద్యోగి.. సులువుగా డబ్బు సంపాదించే మార్గం వెతుక్కొని.. అలా కోట్లు సంపాదించి, వాటిని క్షణాల్లో ఖర్చు చేసేసి ఎలా మారడనే ఈ కథనం అందరినీ మెప్పించేలా చేస్తోంది.

ఎవరెలా చేశారంటే::

భాస్కర్ ప్రపంచంలో దుల్కర్ ఒదిగిపోయాడు. సీతారామం మూవీ తరహాలోనే మలయాళ నటుడని భావనని లేకుండా తన పెర్ఫార్మన్స్ తో మెప్పించాడు. ఈ సినిమాతో దుల్కర్ తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అవుతాడు. గృహిణి పాత్రలో మీనాక్షి చౌదరి ఒదిగిపోయింది. భాస్కర్ భార్యగా సుమతి నటన బాగుంది. ఈ సినిమాతో మీనాక్షికి మంచి పాత్ర దక్కింది. భాస్కర్ కొడుకుగా రిత్విక్, సీబీఐ ఆఫీసర్ గా సాయికుమార్ తో సహా మిగతా నటులు తమ పాత్రల పరిధిమేరకు నటించి మెప్పించారు. 

సాంకేతిక అంశాలు::

నవీన్‌ నూలి ఎడిటింగ్‌ సినిమాకు ప్లస్ అయింది. నిమిష్ రవి సినిమాటోగ్రఫీతో పాటు జీవి ప్రకాష్ కుమార్ అందించిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాని ఉన్నతంగా నిలిచేలా చేశాయి. రచన, దర్శకత్వం చేసిన వెంకీ అట్లూరి మరోసారి మంచి కథతో వచ్చి సక్సెస్ అయ్యాడు. ఆయన రాసుకున్న కథ నేటి సమాజానికి మరింత ప్రభావం చూపించేలా తెరకెక్కించి ఆలోచింపజేసాడు.

అందుకోసం తాను రాసుకున్న ‘ఒక రోజులో అరగంట నాకు నచ్చినట్టుగా సాగలేదని, జీవితమంతా ఏడుస్తూ కూర్చోవాలా’ అనే మాటలు సినిమా స్థాయిని పెంచేలా చేశాయి.  ముఖ్యంగా మిడిల్ క్లాస్ మెంటాలిటీ గురించి రాసుకున్న డైలాగ్స్ మెప్పించేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు.