- పూరన్, మయాంక్ యాదవ్,బిష్ణోయ్‌ను రిటైన్ చేసుకోనున్న ఫ్రాంచైజీ
- అన్‌క్యాప్డ్ ప్లేయర్లు మోసిన్,బదోనీకి కూడా అవకాశం
ముంబై : లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ వచ్చే ఐపీఎల్‌లో జట్టు మారనున్నాడు. మెగా వేలానికి ముందు రాహుల్‌తో బంధాన్ని తెంచుకోవాలని లక్నో ఫ్రాంచైజీ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. అదే సమయంలో నికోలస్ పూరన్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్‌తో పాటు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు మోసిన్ ఖాన్, ఆయుష్ బదోనీని రిటైన్ చేసుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. 2022లో లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్‌లోకి రాగా.. మూడు సీజన్ల పాటు రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. కానీ, గత సీజన్‌లో లక్నో తీవ్రంగా నిరాశపరిచింది.
అదే సమయంలో ఆ టీమ్ ఓనర్ సంజీవ్ గోయెంకాతో కేఎల్‌కు పడటం లేదన్న వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాహుల్ జట్టు మారుతాడని ముందు నుంచే ప్రచారం జరుగుతోంది.ఈ నేపథ్యంలో చివరి నిమిషంలో ఇరు పక్షాలు మనసు మార్చుకుంటే తప్ప రాహుల్ జట్టుతో కొనసాగడం కష్టమే. లక్నో వద్ద ఒక రైట్ టు మ్యాచ్ (ఆర్‌టీఎం) ఆప్షన్ ఉన్నా దాన్ని కేఎల్ కోసం వాడే చాన్స్ లేదు.
టాప్ రిటెన్షన్‌గా పూరన్!
ఐదుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకోనున్న సూపర్ జెయింట్స్ వారికి కేటాయిస్తున్న మొత్తం వివరాలను వెల్లడించాల్సి ఉంది. అయితే ఈ ఐదుగురి కోసం రిటెన్షన్ పాలసీ ప్రకారం ఐపీఎల్ వేలంలో లక్నో ఖాతా నుంచి రూ. 51 కోట్లు మినహాస్తారు. వికెట్ కీపర్ బ్యాటర్‌గానే కాకుండా కెప్టెన్‌గా కూడా పని కొచ్చే పూరన్ టాప్ రిటెన్షన్‌గా ఉంటారని తెలుస్తోంది. రాహుల్ గాయపడి జట్టుకు దూరమైన కొన్ని మ్యాచ్‌ల్లో పూరన్ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ ఫార్మాట్‌లో బెస్ట్ పవర్ హిట్టర్లలో ఒకడైన పూరన్‌ను గత సీజన్‌లో సూపర్ జెయింట్స్ రూ. 16 కోట్లకు కొనుగోలు చేసింది.
కేఎల్‌ను వదులుకుంటే పూరన్‌కే కెప్టెన్సీ అప్పగించే అవకాశం లేకపోలేదు. పూరన్ తర్వాత స్పీడ్ స్టర్ మయాంక్ యాదవ్, స్పిన్నర్ రవి బిష్ణోయ్ 2, 3వ రిటెన్షన్స్‌గా ఉండనున్నారు. 150 ప్లస్ కి.మీ స్పీడుతో బంతులు వేస్తూ మయాంక్ గత సీజన్‌లోనే వెలుగులోకి వచ్చాడు. గాయం కారణంగా నాలుగు మ్యాచ్‌లే ఆడినప్పటికీ తన బౌలింగ్‌తో అందరినీ మెప్పించాడు. ఐపీఎల్ పెర్ఫామెన్స్‌తో అతను నేషనల్ టీమ్‌లోకి కూడా వచ్చాడు. బంగ్లాదేశ్‌తో టీ20ల్లో అరంగేట్రం చేసిన మయాంక్ యాదవ్ ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్నాడు. లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ మూడు సీజన్ల నుంచి జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. 2022లో రూ. 4 కోట్లతో లక్నో జట్టులోకి వచ్చిన అతను నిలకడగా ఆడుతూ వికెట్లు పడగొడుతున్నాడు.
బదోనీ, మోసిన్‌కు బంపరాఫర్
యంగ్ క్రికెటర్లు ఆయుష్ బదోనీ, మోసిన్ ఖాన్‌లకు లక్నో జట్టు బంపరాఫర్ ఇవ్వనుంది. 2022లో చెరో 20 లక్షలతో ఈ ఇద్దరూ లక్నో ఫ్రాంచైజీలో చేరారు. దూకుడైన మిడిలార్డర్ బ్యాటర్ అయిన బదోనీ తన పవర్ హిట్టింగ్‌తో 2023లో మంచి పేరు తెచ్చుకున్నాడు. యూపీకి చెందిన లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ మోసిన్ 2022లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేస్తూనే అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ సీజన్‌లో తొమ్మిది మ్యాచ్‌ల్లోనే 14 వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు.
గాయంతో ఇబ్బందికి గురైనా గత ఐపీఎల్ సెకండాఫ్‌లో పది మ్యాచ్‌ల్లో పది వికెట్లు తీశాడు. కాగా, ఐపీఎల్‌లోని పది జట్లు తాము రిటైన్ చేసుకుంటున్న ఆటగాళ్ల జాబితాను ప్రకటించేందుకు గురువారం సాయంత్రం వరకు గడువు ఇచ్చారు. అదే రోజు అన్ని ఫ్రాంచైజీలు తమ జాబితాను వెల్లడించే అవకాశం ఉంది.