Rain Alert: అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టనున్న వర్షాలు

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. 24 గంటల్లో అల్పపీడనం బలహీనపడే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ భారీ హెచ్చరిక చేసింది.  అల్పపీడన ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లవద్దని సూచించారు. రెండు రోజుల పాటు ( డిసెంబర్   27 సాయంత్రం నుంచి)ఎడ తెరిపి లేకుండా వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.  తెలంగాణపై అల్పపీడన ప్రభావం పడింది. అల్పపీడనం కారణంగా తెలంగాణలో రెండు రోజులపాటు ( డిసెంబర్ 27 సాయంత్రం నుంచి )  తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో ఆకాశం నలువైపులా మేఘాలు ముసురుకోవడంతో పగలంతా చల్లబడుతుంది. కొన్నిచోట్ల ముసురు పడగా.. చాలాచోట్ల చిరుజల్లులు కురుస్తాయి.  నిన్న ( డిసెంబర్ 26) ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అకాల వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల దగ్గరకు తెచ్చిన రైతుల ధాన్యం తడిసి ముద్దవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. కోనుగోలు కేంద్రాల దగ్గర ధాన్యం కోనుగోళ్లు స్పీడ్ అప్‌ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

 హైదదాబాద్‌లో అల్పపీడన ప్రభావంతో  మూడు  రోజుల పాటు పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది . ఓవైపు చలి.. మరోవైపు చిరుజల్లులతో నగర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అల్ప పీడన ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలతో పాటు రాబోయే ఐదు రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు

మరోవైపు  ఆంధ్రప్రదేశ్ లో  శ్రీకాకుళం, విజయనగరం, మన్యంతో పాటు.. నెల్లూరు జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. 24 గంటల్లో కోస్తాలో తేలిక నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారుల సూచించారు. ప్రధాన ఓడ రేవుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. డిసెంబర్ 27 ఉదయం నుంచి  అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా వర్షం పడుతుంది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కోతకు వచ్చిన వరి పంట నీటిపాలవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. గుంటూరు, పల్నాడు జిల్లాలో ప్రత్తి పంటకు భారీ నష్టం వాటిల్లింది. ప్రభుత్వమే ఆదుకోవాలి రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.