- వృద్ధులపై అమెరికన్ సైంటిస్టుల పరిశోధనలో వెల్లడి
- ఫ్లేవనాల్ ఉండే ఫుడ్ లేదా సప్లిమెంట్లతో మెమరీ లాస్‌ను తగ్గించొచ్చని సూచన
న్యూఢిల్లీ: వృద్ధులకు ఫ్లేవనాల్ అనే కెమికల్ లోపిస్తే.. వయసు రీత్యా వచ్చే మెమరీ లాస్ సమస్య పెరుగుతుందని అమెరికన్ సైంటిస్టుల స్టడీలో వెల్లడైంది. ఫ్లేవనాల్స్ బాగా ఉండే పండ్లు, కూరగాయలు తినడం ద్వారా లేదంటే ఫ్లేవనాల్ సప్లిమెంట్లను వేసుకోవడం ద్వారా ఈ సమస్యను తగ్గించొచ్చని వారు గుర్తించారు. పరిశోధనలో భాగంగా 60 ఏండ్లు పైబడిన 3,500 మంది వృద్ధులపై అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ, బ్రిఘామ్ అండ్ విమెన్స్ హాస్పిటల్‌కు చెందిన సైంటిస్టులు మూడేండ్ల పాటు స్టడీ చేశారు. వాలంటీర్లలో కొందరికి రోజూ 500 మిల్లీగ్రాముల ఫ్లేవనాల్ సప్లిమెంట్లను ఇచ్చారు. మిగతా వారికి డమ్మీ గోలీలను అందించారు. అనంతరం ఏడాదికోసారి వారికి పరీక్షలు చేసి, మెమరీ లాస్ అయిందా? పెరిగిందా? అన్నది రికార్డ్ చేశారు. మూడేండ్ల తర్వాత ఫలితాలను విశ్లేషించారు. దీంతో ఫ్లేవనాల్ గోలీలను వేసుకున్న వారి మెదడులోని హిప్పోక్యాంపస్‌లో జ్ఞాపకశక్తికి సంబంధించిన డెంటేట్ గైరస్ అనే భాగం పనితీరు మెరుగుపడినట్లు గుర్తించారు. ఫ్లేవనాల్ లోపం ఉండి, డమ్మీ గోలీలు వేసుకున్న వారిలో మాత్రం ఈ భాగం పనితీరు మందగించినట్లు కనుగొన్నారు. అయితే, ఫ్లేవనాల్ లోపం లేని వృద్ధుల్లో మాత్రం సప్లిమెంట్లు వేసుకున్నప్పటికీ ఎలాంటి ఎఫెక్ట్ కనిపించలేదని సైంటిస్టులు తెలిపారు. అదేవిధంగా మెదడులో జ్ఞాపకశక్తికి సంబంధించిన ఇతర భాగాలపై కూడా ఈ సప్లిమెంట్ల ప్రభావం ఏమాత్రం కనిపించలేదన్నారు. వీరి స్టడీ వివరాలు ఇటీవల ‘ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్(పీఎన్ఏఎస్)’ జర్నల్ లో పబ్లిష్ అయ్యాయి.
