న్యూఢిల్లీ: పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల (డిస్కమ్)కు నష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2020-–21లో డిస్కమ్‌ల మొత్తం నష్టాలు 66 శాతం పెరిగి రూ. 50,281 కోట్లకు చేరుకున్నాయని కేంద్రానికి చెందిన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ రిపోర్టు తెలిపింది. ఉదయపూర్‌లో జరిగిన రాష్ట్రాల విద్యుత్ మంత్రుల సదస్సులో '2020-–21లో పవర్ యుటిలిటీల పనితీరుపై రిపోర్టు' విడుదల చేపింది. దీని ప్రకారం..ఏటీ&సీ (అగ్రిగేట్ టెక్నికల్, కమర్షియల్) నష్టాలు 2019-–20లో 20.73 శాతం నుండి 2020-–-21 సంవత్సరంలో 22.32 శాతానికి తగ్గాయి. ఈ రిపోర్టులో 2020-–21కి సంబంధించి, 68 డిస్కమ్‌లు, 23 పవర్ జనరేషన్ యుటిలిటీలు, 22 పవర్ ట్రాన్స్‌మిషన్ యుటిలిటీలు, 4 పవర్ ట్రేడింగ్ యుటిలిటీలతో కూడిన 117 యుటిలిటీల వివరాలు ఉన్నాయి. డిస్కమ్‌ల మొత్తం (అగ్రిగేట్) నష్టాలు 2019-–20లో రూ. 30,203 కోట్ల నుండి 2020-–21లో రూ. 50,281 కోట్లకు పెరిగాయి.
పునరుజ్జీవన పథకం (ఉదయ్) కింద రెగ్యులేటరీ ఆదాయం రెవెన్యూ గ్రాంట్ మినహా టారిఫ్ సబ్సిడీపై మొత్తం నష్టాలు నష్టాలు 2019-–20లో రూ.63,949 కోట్ల నుంచి 2020-–21లో రూ.88,500 కోట్లకు పెరిగాయి. ప్రభుత్వ యాజమాన్యంలోని డిస్కమ్‌లను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఉజ్వల్ డిస్కమ్ అష్యూరెన్స్ యోజన (ఉదయ్)ని కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రారంభించింది. వడ్డీ భారం, విద్యుత్ ఖర్చు, పంపిణీ రంగంలో విద్యుత్ నష్టాలను తగ్గించడం డిస్కమ్‌ల సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఈ పథకం అమలవుతోంది. డిస్కమ్‌ల ద్వారా అమ్మిన కరెంటు 2019-–20లో 10,24,309 మిలియన్ యూనిట్లు (ఎంయూ) కాగా 2020-–21లో 10,05,044 మిలియన్ యూనిట్లు. ఇది సంవత్సరానికి 1.88 శాతం తగ్గుదలని నమోదు చేసింది. టారిఫ్ సబ్సిడీ బిల్లుతో సహా విద్యుత్ అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం 2019-–20లో రూ. 6,43,881 కోట్ల నుండి 2020-–21 నాటికి రూ. 6,32,543 కోట్లకు తగ్గింది. డిస్కమ్‌లు బిల్ చేసే టారిఫ్ సబ్సిడీ 2019-–20లో రూ.1,20,828 కోట్ల నుంచి 2020-–21లో రూ.1,32,416 కోట్లకు పెరిగింది. మొత్తం ఆదాయంలో యుటిలిటీల ద్వారా బిల్ అయిన టారిఫ్ సబ్సిడీ 2019-–20లో 16.52 శాతం నుండి 2020-–21లో 18.53 శాతానికి పెరిగింది. డిస్కమ్‌ల ద్వారా తీసుకున్న మొత్తం అప్పులు రూ. 5,86,194 కోట్లకు పెరిగాయి.
