తెలంగాణలో ఘోరం: రోడ్డు పక్కన కూరగాయలు అమ్మేవాళ్లపైకి దూసుకెళ్లిన లారీ

చేవెళ్ల: రంగారెడ్డి జిల్లాలో లారీ బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకునేవాళ్ల పైకి లారీ దూసుకెళ్లింది. చేవెళ్ల మండలం ఆలూర్ గేట్ దగ్గర ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్లోనే చనిపోయినట్లు తెలిసింది. ఏడుగురు ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో 20 మందికి తీవ్ర గాయాలు అయినట్లు తెలిసింది. కాళ్లు, చేతులు విరిగి కొట్టుమిట్టాడుతున్న క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతంలో భీతావహ పరిస్థితులు కనిపించాయి. లారీ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. ప్రమాదానికి కారణాలు తెలియలేదు. హైదరాబాద్- బీజాపూర్ హైవేపై ఈ ఘటన జరిగింది.

ALSO READ : బైక్‎ను తప్పించబోయి RTC బస్ బోల్తా.. 10 మంది మృతి.. 20 మందికి గాయాలు*

రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకునే వాళ్లపైకి దూసుకెళ్లి చెట్టుకు ఢీకొని లారీ ఆగింది. ఉన్నట్టుండి జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగా అక్కడున్న వారంతా హతాశులయ్యారు. కూరగాయలు అమ్ముకుంటూ, కొనుక్కుంటూ అప్పటిదాకా సందడిగా ఉన్న ఆ ప్రాంతం రక్తపు మడుగులతో నిండిపోయింది. గాయపడిన వారిలో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నట్టు తెలిసింది. అతి వేగమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మితిమీరిన వేగంతో లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్లే ఈ ఘోరం జరిగిందని చెప్పారు.

లారీ  బీభత్సంలో చనిపోయిన వారి వివరాలు:

 రాములు (ఆలూరు), ప్రేమ్ (ఆలూరు), సుజాత (ఖానాపూర్)