కర్నూలు జిల్లా డోన్ రూరల్ పోలీసు స్టేషన్ ఎదుట.. పొదుపు మహిళల ఆటోను లారీ ఢీకొట్టింది. హైవే నుండి ఊరిలోకి వెళ్లేందుకు ఆటో నిదానంగా టర్న్ తీసుకుంటుండగా.. హైవే నెంబర్-44 పై హైదరాబాద్ నుండి బెంగళూరు కు వేగంగా వెళ్తున్న ట్రక్ వచ్చి ఢీకొట్దింది. దీంతో ఆటోలో ఉన్న వారంతా రోడ్డుపై చెల్లా చెదురుగా పడిపోయారు. స్థానికులు గుర్తించి వెంటనే అంబులెన్స్ ను రప్పించారు. తీవ్ర రక్తగాయాలతో ఆర్తనాదాలు చేస్తున్న వారికి స్థానిక ఆస్పత్రిలో ప్రాథమిక పరీక్షలు చేయించి.. కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆటోను ట్రక్కు ఢీకొట్టిన సమయంలో ఆటోలో డ్రైవర్ సహా 14 మంది ఉన్నారు. చిన్నారి సహా 8 మంది పొదుపు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నలుగురి పరిస్థితి తీవ్రంగా ఉండడంతో.. వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. వెల్దుర్తి మండలం మల్లెపల్లికి చెందిన కస్తూరి గ్రూప్ పొదుపు మహిళలు డోన్ స్టేట్ బ్యాంకులో బ్యాంక్ లోన్ తీసుకునేందుకు వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు.

