హైదరాబాద్: ముషీరాబాద్ క్రాస్ రోడ్స్‌లో ఆదివారం (డిసెంబర్ 29) అర్ధరాత్రి లారీ బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చిన లారీ అదుపు తప్పి రోడ్డు పక్కన వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు చెందిన పెట్రోలింగ్ వాహనం సైతం ధ్వంసం అయింది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న చిలకలగూడ పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. మృతి చెందిన వ్యక్తిని అబ్ధుల్లాగా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ యూసఫ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలిసింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.