ఆధ్యాత్మికం: శ్రీరాముడు మరణించే సమయంలో.. ఆంజనేయస్వామి ఎక్కడ ఉన్నాడో తెలుసా..

ఆంజనేయుడు .. శ్రీరామునికి నమ్మిన బంటు.. రాముని పాదాల వద్దే ఎప్పుడే ఉండే హనుమంతుడు.. ఆయన అవతారం చాలించే సమయంలో హనుమంతుడు ఆయన దగ్గర లేడట.  ఆ సమయంలో కూడా అక్కడే ఉంటే ఆయనకు మరణం సంభవించి ఉండేది కాదని రుషులు చెబుతున్నారు. పురాణాల ప్రకారం రాముడు కాలం చేసే సమయంలో హనుమంతుడు ఎక్కడ ఎన్నాడు. .. అక్కడకు ఎందుకు వెళ్లాడో తెలుసుకుందాం.. 

యావత్​జగత్​ లో ఏ జీవి ఆయు: ప్రమాణాన్నైనా బ్రహ్మదేవుడు నిర్దేశిస్తాడు.  అందుకే బ్రహ్మమూర్తంలోనే పూజలు చేయాలని పండితులు చెబుతుంటారు. జీవుల ఆయుష్​ తీరినప్పుడు వారిని అంతమొందించేందుకు బ్రహ్మదేవుడు కాలపురుషుడిని పంపుతాడు.  అలాగే  శ్రీరాముల వారి అవతార పరిసమాప్త సమయంలో బ్రహ్మదేవుడు ఆయనను తమ అవతారం ఉపసంహరింపమని కోరడానికి కాలపురుషుడిని రాముని వద్దకు పంపుతాడు.  శ్రీరాముడు కూడా తాను చెప్పిన  దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని అనగా 11 వేల  సంవత్సరాల రాజ్యపాలన పూర్తిచేసి తన అవతార కార్యం పూర్తి కావడంతో తన స్వధామమైన వైకుంఠం చేరడానికి అనువైన సమయం కోసం చూస్తూ వుంటారు. 

ALSO READ | వారఫలాలు ( సౌరమానం) సెప్టెంబర్ 22 నుంచి 28 వరకు

శ్రీరాముడు అవతారం చాలించాలంటే ...కాలపురుషుడు రాముడున్న అయోధ్యలోకి ప్రవేశించాలి.  ఆ నగరానికి కాపలాగా వున్న హనుమంతుల వారిని దాటి రావాలి. హనుమంతుడు కావలి ఉన్నంతసేపు కాలపురుషుడు (యముడు)  లోనికి రాలేడు.  ఈ విషయాన్ని గ్రహించిన  శ్రీరాముడు తన అంగుళీయం తన భవనంలో ఉన్న నేల పైన చిన్న బీటలోకి పడవేసి... హనుమంతుడిని ఆ ఉంగరం పట్టుకురమ్మని ఆజ్ఞాపించాడని బ్రహ్మాండ పురాణంలో ఉందని పండితులు చెబుతున్నారు.  

ఇక శ్రీరాముని ఆఙ్ఞ మేరకు హనుమంతుడు కామ ( సూక్ష్మ) రూపం ధరించి చిన్న కీటకంగా మారి  ఆ బిలంలోకి వెళ్తారు. వెళ్ళగా వెళ్ళగా పాతాళబిలం వద్దకు చేరుకుంటాడు. అక్కడ వాసుకి అనే మహర్షి .. ఆయనను గుర్తించి ఆయనను గౌరవించి వచ్చిన కార్యం గురించి అడుగుతాడు.  శ్రీరాములవారి అంగుళీయం గురించి చెప్పి ఆ చోటు చూపమని అభ్యర్దిస్తాడు.  అప్పుడు వాసుకి ఆయనను ఒక గుట్టలా ఉన్న ఉంగరాలున్న చోటు చూపించి అందులో రాముని ఉంగరం తీసుకోమని చెబుతాడు.  శ్రీరాముని ప్రార్ధించి తీసిన మొదటి ఉంగరం అదృష్టవశాత్తు శ్రీరాముని ఉంగరంగా గుర్తించి ఆనందిస్తాడు.

వాసుకి “మరొకటి చూడు” అని చెప్పగా, అది కూడా అచ్చం శ్రీరాముని ఉంగరంలానే వుంటుంది. అలా అక్కడ గుట్టగా ఉన్న అన్ని ఉంగరాలు కూడా శ్రీరాముని ఉంగరాలే అని ఆశ్చర్యపోతున్న హనుమంతునికి చెబుతాడు వాసుకి... ”ఏమిటి ఈ మాయ స్వామీ వివరించండి” అని ప్రార్ధించగా.. వాసుకి చెబుతాడు... ”ఇవన్నీ కూడా శ్రీరాముని ఉంగరాలే. ఇవన్నీ ప్రతీ కల్పంలో శ్రీరాముడు అవతార స్వీకారం చేస్తారు, ఆయన అవతార సమాప్తి సమయంలో ఒక ఉంగరం వచ్చి పడుతుంది, దానిని వెతుక్కుంటూ ఒక మర్కటం వస్తుంది, ఇదే ప్రశ్న అడుగుతుందని, ఇప్పటికి ఎన్నో కల్పాలనుండి ఇదే.. జరిగే తతంగం అని, రాబోయే రాముల ఉంగరాలు ఉంచే స్థలం కూడా వుందని చెబుతాడు వాసుకి.

శ్రీరాముడు అనంతుడు...  అలా ప్రతీ కల్పంలోనూ ఇలా వస్తూ వుంటారు... తాను చేయాల్సిన కార్యము పూర్తి అయిన తరువాత అవతారం చాలించి వెళ్తుంటారు అని చెప్పాడు, ఇప్పుడు  కూడా అలాగే  శ్రీరామ అవతార సమాప్తిని ఆపే శక్తి హనుమంతునికి లేదని చెబుతాడు.  కాలం అనంతం...  అనాది నుండి ఈ కాలప్రవాహంలో ఎన్నో కల్పాలు వచ్చాయి పోయాయి..  వస్తాయి..పోతాయి.. కూడా. కానీ ఎప్పటికీ ఆ పరబ్రహ్మం మాత్రమే శాశ్వతం. ఆయన లీలలు అనంతం...  ఈ అనంత ప్రవాహంలో ఎన్నో ప్రాణులు పుడతాయి ..గిడతాయి.. వాటి పాపపుణ్యాల ఆధారంగా మళ్ళీ పుడుతూనే ఉంటాయి.

పుట్టిన ప్రతీది కాలగర్భంలో కలవకమానదు.. చివరకు అవతారం స్వీకరించిన పరబ్రహ్మ స్వరూపమైనా.. ఏ జీవి అయినా ఈ కాల స్వరూపమే పరబ్రహ్మ.   చివరకు అన్నీ ఆయనలోనే లీనమౌతాయి. 
ఈ విషయం  మన సనాతనధర్మం మాత్రమే చెప్పింది. ఈ నాటకం నిరంతరం జరుగుతూ వుంటుంది. ఈ నాటకం   రక్తి కట్టించడానికి స్వామీ కూడా ఒక పాత్ర ధరిస్తాడు, రంజింపచేస్తాడు, ధర్మాన్ని నిలుపుతాడు.

ALSO READ | ఆధ్యాత్మికం: ఇందిర ఏకాదశి ఎప్పుడు.. ఆ రోజు ఏంచేయాలి..

జగన్నాటక సూత్రధారిని నమ్మి ఆయనను పట్టుకున్నవాడు హనుమంతుడిలా చిరంజీవిగా నిలబడతాడు.  ఈ కాలప్రవాహాన్ని దాటగల నావ కేవలం ఆయన మీద భక్తి, ఆయనకు శరణాగతి చెయ్యడం. అందుకే కాలుడు ఆయన నామాన్ని పట్టుకున్న హనుమంతుడి వద్దకు వెళ్ళలేడు. అటువంటి హనుమంతుని త్రికరణశుద్ధిగా పట్టుకున్న భక్తులను అకాలమృత్యువు పట్టదు.అన్ని కాలాలలో రక్షించి ముక్తిని ఇచ్చే ఆ పరబ్రహ్మ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడే మనల్ని ఉద్ధరించ గలిగినవాడు.  అన్నమయ్య చెప్పినట్టు.. 

ఈ ఆదిమూలమే మనకు అంగరక్ష
 ఆ శ్రీదేవుడే మనకు జీవ రక్ష
 ఆ భూదేవి పతి అయిన పురుషోత్తముడే మాకు .. ఈ భూమికి రక్షా
 జలధిశాయి అయిన ఆయనే మనకు జలరక్ష,
అగ్నిలో ఉన్న యజ్ఞమూర్తి మనకు అగ్నిరక్ష
 వాయుసుతుని ఏలినట్టి వనజనాభుడు మనకు వాయురక్ష
  పాదము ఆకాశమునకు చాచిన ఆ విష్ణువే మనకు ఆకాశరక్ష
 ఈ వెంకటాద్రి పైన ఉన్న ..ఈ సర్వేశ్వరుడే మనకు సర్వ రక్ష